
నిరాశను కుంగదీయాలి
ఆత్మీయం
మనిషికి ఆశ ఉండాలి కానీ, దురాశ ఉండకూడదు. అదేవిధంగా నిరాశ కూడా ఉండకూడదు. నిరాశ మనిషిని కుంగదీసేస్తుంది. ఏ పనీ చెయ్యనివ్వకుండా అడ్డుపడుతుంటుంది. నిరాశగా ఉన్న వ్యక్తిని చూస్తే ఎదుటి వాళ్లకు కూడా చికాకు పుడుతుంది. నిరాశ అనేది నిప్పును కప్పిన బూడిద వంటిది. నిప్పుమీద చేరిన బూడిదను ఎప్పటికప్పుడు తొలగించకపోతే నిప్పు కూడా ఆరిపోతుంది.
డిప్రెషన్‌కు మిత్రుడు నిరాశే. ‘‘నాకెవ్వరూ లేరు. నేనేమీ చేయలేను, నాకెవ్వరూ ఏమీ చేయరు. నన్ను ఒడ్డెక్కింటే వాడే లేడు’’ లాంటి నిరాశాపూరిత ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే కుంగదీసి పీల్చి పిప్పి చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆశ అనేది మినుకు మినుకు మని వెలిగే దీపంలాంటిదయితే, చీకటి గుయ్యారం లాంటిది నిరాశ. ఆశ ఉంటే దేనినైనా సాధించగలం. బతకగలం. బతుకును ఇవ్వగలం. నిరాశ ఉంటే బతకలేము; బతుకును ఇవ్వలేము.
రాముడు, సీత, హనుమంతుడు.. వీళ్లు ఆశకు, ఆశయానికి ప్రతీకలు. తానెక్కడున్నదో తన భర్త కనుక్కోలేడని సీత నిరాశ పడితే..? ‘ఒక సాధారణమైన కోతినైన నేను ఈ మహా సముద్రాన్ని ఎలా దాటగలను, ఒకవేళ దాటినా కనీసం ముఖం కూడా చూసి ఉండని సీతమ్మను నేను ఎలా కనుక్కోగలను’ అని హనుమ అనుకుని ఉంటే..? మామూలు మనిషినైన నేను అపారమైన బలసంపదలు గల ఆ రావణాసురుడిని ఎలా సంహరించగలను అని రాముడు నిరాశ పడి ఉంటే అసలు రామాయణమే ఉండేది కాదు!