
ఢాకా: ఓపెనర్ షై హోప్ (144 బంతుల్లో 146 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో కడదాకా నిలవడంతో బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 255 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (62), ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ (65) అర్ధశతకాలు సాధించారు. ఒషేన్ థామస్ (3/54) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా చూశాడు.
ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హోప్ దాదాపు ఒంటరి పోరాటం చేశాడు. డారెన్ బ్రేవో (27), మార్లోన్ శామ్యూల్స్ (26) ఫర్వాలేదనిపించగా, హేమ్‌రాజ్ (3), హెట్‌మైర్ (14), రావ్‌మన్ పావెల్ (1), ఛేజ్ (9) విఫలమయ్యారు. 185 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో హోప్‌కు కీమో పాల్ (18 నాటౌట్) అండగా నిలిచాడు. దీంతో విండీస్ 49.4 ఓవర్లలో 256 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రెండు జట్ల మధ్య మొదటి వన్డేలో బంగ్లాదేశ్ నెగ్గింది. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే శుక్రవారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment