వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్‌కాయ్ తలో వికెట్ పడగొట్టారు.
130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్‌పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment