WI Vs BAN: వెస్టిండీస్‌పై చారిత్రక విజయం​ సాధించిన బంగ్లాదేశ్‌ | WI Vs BAN: Bangladesh Beat West Indies By 7 Runs In First T20, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

WI Vs BAN 1st T20: వెస్టిండీస్‌పై చారిత్రక విజయం​ సాధించిన బంగ్లాదేశ్‌

Published Mon, Dec 16 2024 9:55 AM | Last Updated on Mon, Dec 16 2024 11:04 AM

Bangladesh Beat West Indies By 7 Runs In First T20

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. కింగ్స్‌టౌన్‌ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్‌ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్‌కు చారిత్రక గుర్తింపు దక్కింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్‌ (43), జాకెర్‌ అలీ (27), మెహిది హసన్‌ (26 నాటౌట్‌), షమీమ్‌ హొసేన్‌ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్‌ ఛేజ్‌, రొమారియో షెపర్డ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్‌ 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. హసన్‌ మహహూద్‌, తస్కిన్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్‌ హసన్‌, రిషద్‌ హొసేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

రోవ్‌మన్‌ పావెల్‌ (60) విండీస్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం​ చేశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్‌ పావెల్‌తో పాటు రొమారియో షెపర్డ్‌ (22), జాన్సన్‌ ఛార్లెస్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్‌ వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌ ఐదుగురు విండీస్‌ బ్యాటర్లను ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్‌ 17న జరుగనుంది.

కాగా, టీ20 సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement