టెస్ట్‌ క్రికెట్‌లో విండీస్‌ బౌలర్‌ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..! | WI VS BAN 2nd Test: JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ క్రికెట్‌లో విండీస్‌ బౌలర్‌ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!

Published Mon, Dec 2 2024 3:04 PM | Last Updated on Mon, Dec 2 2024 3:51 PM

WI VS BAN 2nd Test: JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS

టెస్ట్‌ క్రికెట్‌లో విండీస్‌ బౌలర్‌ జేడన్‌ సీల్స్‌ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సీల్స్‌ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్‌ క్రికెట్‌లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్‌గా రికార్డులు చెబుతున్నాయి. 

ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్‌ ఎకానమీ రేట్‌ 0.31గా ఉంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్‌ దిగ్గజ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లేకర్ ఓవర్‌కు సగటున 0.37 పరగులిచ్చాడు. 

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ సగటు భారత దిగ్గజ బౌలర్‌ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఓవర్‌కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.

ఆల్‌టైమ్‌ రికార్డు
టెస్ట్‌ క్రికెట్‌లో సీల్స్‌ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్‌కు చెందిన పర్వేజ్‌ సజ్జద్‌ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సజ్జద్‌ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో సజ్జద్‌ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్‌లో సీల్స్‌ సగటు 0.31గా ఉంది.


ఉమేశ్‌ యాదవ్‌ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్‌
1978 నుంచి టెస్ట్‌ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ 0.42 సగటున బౌలింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్‌ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్‌ రికార్డును సీల్స్‌ బద్దలు కొట్టాడు.

కుప్పకూలిన బంగ్లాదేశ్‌
జమైకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్‌ సీల్స్‌ 4, షమార్‌ జోసఫ్‌ 3, కీమర్‌ రోచ్‌ 2, అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్‌ ఇస్లాం (64), మెహిది హసన్‌ మిరాజ్‌ (36), షహాదత్‌ హొసేన్‌ దీపు (22), తైజుల్‌ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్‌ లూయిస్‌ 12 పరుగులు చేసి ఔట్‌ కాగా.. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (33), కీసీ కార్తీ (19) క్రీజ్‌లో ఉన్నారు. లూయిస్‌ వికెట్‌ నహిద్‌ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్‌ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో నెగ్గింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement