
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన గిల్.. ఓ స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌కు చేరాడు. నంబర్ వన్ స్థానానికి చేరే క్రమంలో గిల్ పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బాబర్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
సచిన్, విరాట్, ధోని తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరిన నాలుగో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ నంబర్ స్థానానికి చేరడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ గిల్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గిల్‌కు రెండో స్థానంలో ఉన్న బాబర్‌కు మధ్య 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో గిల్‌తో కలుపుకుని భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో.. విరాట్ కోహ్లి ఆరులో.. శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో నిలిచారు. గత వారంతో పోలిస్తే శ్రేయస్ ఓ ర్యాంక్ మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ నాలుగులో, న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ఐదులో.. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఏడులో.. లంక కెప్టెన్ అసలంక ఎనిమిదిలో.. షాయ్ హోప్ పదో స్థానంలో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌ను కిందకు దించి లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్‌తో పాటు సిరాజ్ (10వ ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. నమీబియా బౌలర్ బెర్నాల్డ్ స్కోల్జ్ మూడులో.. షాహీన్ అఫ్రిది ఐదులో.. కేశవ్ మహారాజ్ ఆరులో.. మిచెల్ సాంట్నర్ ఏడులో .. మ్యాట్ హెన్రీ ఎనిమిదిలో.. గుడకేశ్ మోటీ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. జడ్డూ 217 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లకు మధ్య దాదాపు 800 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment