శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌ | Goosebumps: Sam Curran after his Brother Maiden ODI century For Zimbabwe | Sakshi
Sakshi News home page

శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌

Published Wed, Feb 19 2025 3:01 PM | Last Updated on Wed, Feb 19 2025 3:54 PM

Goosebumps: Sam Curran after his Brother Maiden ODI century For Zimbabwe

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్‌ బెన్‌ కరన్‌(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్‌ బెన్‌ కరన్‌ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే.  130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.

తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 

120 బంతుల్లో శతకం
ఓపెనర్‌ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌లో లొర్కన్‌ టక్కర్‌ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్‌ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గరవ, ట్రెవర్‌ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్‌ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెన్‌ కరన్‌ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. 

తర్వాత కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (59 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.

రోమాలు నిక్కబొడుచుకున్నాయి
ఈ క్రమంలో 120 బంతుల్లో కరన్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్‌ కరన్‌ ఎక్స్‌ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్‌ ఏ బాయ్‌!.. అద్బుత ఇన్నింగ్స్‌’’ అని ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. 

కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్‌ కెవిన్‌ కరన్‌కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్‌ కరన్‌ పెద్దవాడు కాగా.. బెన్‌ కరన్‌ రెండోవాడు. ఇక సామ్‌ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్‌ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్‌, సామ్‌ మాత్రం ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. 

అయితే, కరన్‌ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్‌ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్‌కే దక్కింది. 28 ఏళ్ల బెన్‌ స్పెషలిస్టు బ్యాటర్‌ కాగా..  26 ఏళ్ల సామ్‌ కరన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టార్మ్‌పేస్‌ మీడియం బౌలర్‌ అయిన అతడు లెఫ్టాండర్‌ బ్యాటర్‌. 

ఇక వీరిద్దరి పెద్దన్న టామ్‌ కరన్‌ కూడా బౌలింగ్‌ ఆల్‌రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్‌ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది.

చదవండి: సచిన్‌ కాదు!.. నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌ అతడే: సెహ్వాగ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement