
PC: PCB
CT 2025 Pak vs NZ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు తెరలేచింది. పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ బుధవారం ఆరంభమైంది. ఆతిథ్య పాక్- న్యూజిలాండ్ జట్ల మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది.
ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
అదే విధంగా.. తాము డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నందున కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తమేనన్న రిజ్వాన్.. అయితే, ఇటీవలి ముగిసిన త్రైపాక్షిక సిరీస్ మాదిరే దీనిని సాధారణ సిరీస్‌గా భావిస్తే ప్రెజర్ తగ్గుతుందన్నాడు. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందని.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హ్యారిస్ రవూఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడని తెలిపాడు.
కాగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడింది. ఇందులో ఫైనల్‌కు చేరుకున్న పాక్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
మెగా ఈవెంట్లో కివీస్‌దే పైచేయి
ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరుగగా.. పాకిస్తాన్ 61, న్యూజిలాండ్ 53 మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి టై కాగా.. మూడు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో కివీస్ జట్టే పాక్‌పై గెలుపొందడం విశేషం.
ఇక 1998లో మొదలైన ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని వివిధ కారణాల వల్ల 2017 తర్వాత నిలిపివేశారు. అయితే, తాజాగా మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు.. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా సొంతగడ్డపై అతిపెద్ద క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో మ్యాచ్‌ల నేపథ్యంలో దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను మోహరించేందుకు సిద్ధమైందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1200 మంది ఉన్నతాధికారులు, 10,566 మంది కానిస్టేబుల్స్, 200కు పైగా మహిళా పోలీస్ ఆఫీసర్లు భద్రతా విభాగంలో భాగమైనట్లు తెలిపాయి. అంతేకాదు టోర్నీలో పాల్గొనే జట్లు, వీరాభిమానుల కోసం పీసీబీ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లు
పాకిస్తాన్
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ
Comments
Please login to add a commentAdd a comment