
న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే కివీస్ ఆటగాళ్లు ప్రాధాన్యం ఇస్తారని.. అన్నింటికంటే వాళ్లకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. వారికి ఆట పట్ల నిబద్ధత ఎక్కువని.. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల విషయంలోనూ వారికి స్పష్టమైన అవగాహన ఉంటుందన్నాడు.
ఐకమత్యమే మహాబలం
కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్(Pakistan vs New Zealand) మధ్య మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు బలాల గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఐకమత్యంగా ఉండటమే న్యూజిలాండ్ జట్టుకు ఉన్న ప్రధాన బలం. ఆ జట్టులో సూపర్‌స్టార్లు లేకపోవచ్చు.. కానీ అంతా కలిసి సూపర్‌స్టార్ టీమ్‌ను తయారుచేయగలరు.
టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా.. ప్రతి ఒక్క సభ్యుడికి తమ పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. అంతేకాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వారు ఒక్కోసారి త్యాగాలకు కూడా వెనుకాడరు. ప్రణాళికలు, వ్యూహాల విషయంలో వారు రాజీపడరు. అందుకే వారిని చోకర్స్ అనేందుకు నేను ఇష్టపడను.
వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే వారు ప్రాధాన్యం ఇస్తారు. జట్టు ప్రయోజనాలే పరమావధిగా మైదానంలోకి దిగుతారు. వ్యక్తిగతంగా ప్రకాశించడం కంటే కూడా.. జట్టుగా సత్తా చాటాడమే వారికిష్టం. ప్రస్తుత టీమ్ మొత్తం ఆల్‌రౌండర్లతో నిండిపోయింది. ముగ్గురు లేదంటే నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు.
జట్టు నిండా ఆల్‌రౌండర్లే
ఆఫ్ స్పిన్నర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్లు జట్టుతో పాటే ఉన్నారు. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్... వీరంతా బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. ఇటీవలే న్యూజిలాండ్ త్రైపాక్షిక సిరీస్ గెలిచింది. పాకిస్తాన్ గడ్డపై పాక్‌తో పాటు సౌతాఫ్రికాను ఓడించింది.
వరుస విజయాలు
అంతకు ముందు భారత్‌లో టీమిండియాపై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం కివీస్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. పాక్ పిచ్ పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. ఈ వన్డే ఫార్మాట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది.
ఫెర్గూసన్ స్థానంలో జెమీసన్
చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన పేసర్ లాకీ ఫెర్గూసన్ స్థానంలో మరో పేస్ బౌలర్ కైల్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు.
ఈ మార్పునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. 30 ఏళ్ల జేమీసన్ న్యూజిలాండ్ తరఫున 13 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. జేమీసన్ చివరి వన్డే 2023లో బంగ్లాదేశ్‌పై ఆడాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టు
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీసన్.
చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment