
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిలచ్చిందని పేర్కొన్నాడు.
కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.
మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.
ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.
భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.
ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment