రచిన్‌ రవీంద్రకు తీవ్ర గాయం.. మైదానంలో కుప్పకూలిన కివీ స్టార్‌! వీడియో | New Zealand suffers huge blow as Rachin Ravindra leaves field after massive head injury | Sakshi
Sakshi News home page

PAK vs NZ: రచిన్‌ రవీంద్రకు తీవ్ర గాయం.. మైదానంలో కుప్పకూలిన కివీ స్టార్‌! వీడియో

Published Sun, Feb 9 2025 9:20 AM | Last Updated on Sun, Feb 9 2025 12:22 PM

New Zealand suffers huge blow as Rachin Ravindra leaves field after massive head injury

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టును గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ లాకీ ఫెర్గూస‌న్ గాయం కార‌ణంగా టోర్నీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా మరో కీలక ఆటగాడు ఈ జాబితాలో చేరాడు.

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదిటికి బంతికి బలంగా తాకింది. వెంటనే రచిన్ కింద పడిపోయాడు. అతడికి తీవ్ర రక్త స్రావం జరిగింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రక్త స్రావం ఆపే ప్రయత్నం చేశారు. ఫిజియోలు సాయంతో రచిన్ మైదానాన్ని వీడాడు.

అసలేం జరిగిందంటే?
పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవ‌ర్ వేసిన‌ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో మూడో బంతిని పాక్ బ్యాట‌ర్ కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న‌ ర‌చిన్ బంతిని అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి గ‌మ‌నాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌డంలో ర‌చిన్ విఫ‌ల‌మం కావ‌డంతో.. ఆ బంతి నేరుగా వెళ్లి అత‌డి నుదిటికి తాకింది.

దీంతో అత‌డికి తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది.  ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక గాయ‌ప‌డిన ర‌చిన్‌ను వెంట‌నే అస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా రచిన్ గాయంపై న్యూజిలాండ్ క్రికెట్ అప్‌డేట్ ఇచ్చింది.

"పాక్ ఇన్నింగ్స్ 38వ ఓవ‌ర్‌లో క్యాచ్ అందుకునే ప్ర‌య‌త్నంతో బంతి ర‌చిన్ నుదిటికి బ‌లంగా తాకింది. అత‌డికి రక్త‌స్రావ‌మైంది. దీంతో అత‌డిని మా ఫిజియోలు మైదానం నుంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు. ప్ర‌స్తుతం అత‌డి నుదిటిపై గాయం ఉంది. ర‌చిన్‌ను వెంటనే అస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాము.

అత‌డి గాయం మ‌రీ అంత తీవ్ర‌మైన‌ది కాదు. ర‌వీంద్ర ప్ర‌స్తుతం బాగానే ఉన్నాడు. అత‌డికి హెడ్ ఇంజ్యూరీ అసెస్‌మెంట్(HIA ) ప‌రీక్ష‌లు నిర్వ‌హించాము. అందులో అంతా క్లియ‌ర్‌గా ఉంది. అత‌డు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ చిత్తు..
కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.  గ్లెన్‌ ఫిలిప్స్‌ (74 బంతుల్లో 106 నాటౌట్‌; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు శతకంతో విజృంభించగా... సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (89 బంతుల్లో 58; 7 ఫోర్లు), డారిల్ మిచెల్‌ (84 బంతుల్లో 81; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంరీల‌తో రాణించారు.

 పాకిస్తాన్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... అబ్రార్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (69 బంతుల్లో 84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... సల్మాన్‌ ఆఘా (40), తయ్యబ్‌ తాహిర్‌ (30) రాణించారు. కివీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ సాంట్నర్, మ్యాట్‌ హెన్రీ చెరో 3 వికెట్లు పడగొట్టారు.  ఫిలిప్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 
చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్‌ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement