
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం దాన్ని వద్దనుకున్నాడు.
పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్‌లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు.
శశాంక్ స్వయంగా వచ్చి స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నా శ్రేయస్ వినలేదు. ఆ ఓవర్ అంతా సింగిల్స్‌కు కాకుండా బౌండరీలు, సిక్సర్లకు ప్రయత్నించమని చెప్పాడు.
శశాంక్.. తన కెప్టెన్ చెప్పినట్లుగా చేసే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ఉదంతాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ కోసం కోహ్లి పడ్డ తాపత్రయాన్ని ఫ్యాన్స్ శ్రేయస్ ఉదంతంతో పోల్చుకుంటున్నారు.
అప్పుడు కోహ్లి తన వ్యక్తిగత మైలురాయి కోసం జట్టుకు అదనంగా వచ్చే పరుగును వద్దన్నాడు. సెంచరీకి ముందు కోహ్లి ఆడిన ఓ షాట్‌కు రెండు పరుగులు వచ్చేవి. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న స్టోయినిస్ కూడా రెండో పరుగుకు వచ్చేందుకు సుముఖత చూపాడు. కానీ కోహ్లి మళ్లీ తనే స్ట్రయిక్ తీసుకునేందుకు రెండో రన్ వద్దన్నాడు. తిరిగి స్ట్రయిక్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లి బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసి, అతని జట్టు ఆర్సీబీ గెలిచినా అభిమానులు కోహ్లిని తప్పుబట్టారు. జట్టుకు వచ్చే అదనపు పరుగు కంటే కోహ్లి తన సెంచరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 58 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు (213/4) చేసింది.
ఛేదనలో ఆండ్రీ రస్సెల్ (65), నితీష్ రాణా (85*) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినా కేకేఆర్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
శ్రేయస్ విషయానికొస్తే.. సెంచరీ గురించి పట్టించుకోకపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి గెలిచింది. శ్రేయస్ కూడా కోహ్లిలా సెంచరీ కోసం పాకులాడి ఉంటే పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసుండేది కాదు. శ్రేయస్ సెంచరీ త్యాగం చేసి పంజాబ్ అంత భారీ స్కోర్ చేసినా గుజరాత్ అద్భుతంగా పోరాడి లక్ష్యానికి కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సెంచరీ వదులుకుని హీరో అయ్యాడు.. ఆ రోజు కోహ్లి సెంచరీ చేసి కూడా విమర్శలపాలయ్యాడు.