
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ తన.. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్ రాహుల్‌ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్‌ను కూడా పక్కనపెట్టాడు.
ఇక ఓపెనింగ్ జోడీగా అఫ్గనిస్తాన్ యువ స్టార్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran), న్యూజిలాండ్ యంగ్‌స్టర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్‌గా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్‌కు స్థానమిచ్చాడు.
అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదే
ఇక గ్రూప్ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్‌కు ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆథర్టన్ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్‌కు ఈ మాజీ బ్యాటర్ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్ ఆథర్టన్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ జద్రాన్ బ్యాటింగ్ నుంచి వచ్చింది.
అందుకే రచిన్ రవీంద్రతో పాటు ఓపెనింగ్ జోడీగా జద్రాన్‌ను ఎంచుకున్నా. ఇక వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, రూట్ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా నా ఓటు జోష్ ఇంగ్లిస్‌కే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.
సారథి అతడే
ఇక ఆరోస్థానంలో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్‌తో బాల్‌తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. మిచెల్ సాంట్నర్‌ను నా జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంటాను.
ఇద్దరు సీమర్లు మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్‌తో పాటు మరో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్ ఆథర్టన్ వెల్లడించాడు.
కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి.
ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఆడగా.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఆడాయి.
రాహుల్,శ్రేయస్ అదరగొట్టారు
ఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్ ఓపెనర్ జద్రాన్ ఇంగ్లండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్‌పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్‌పై, వరుణ్ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.
అయితే, టీమిండియా మిడిలార్డర్‌లో దిగి కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(243 రన్స్), కేఎల్ రాహుల్(140 రన్స్)లకు మాత్రం ఆథర్టన్ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్ తరఫున ఆథర్టన్ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:
ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లి, జో రూట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’
Comments
Please login to add a commentAdd a comment