
భారీ అంచనాలతో చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) బరిలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆదిలోనే పరాభం ఎదురైంది. న్యూజిలాండ్(Pakistan vs New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో అరవై పరుగుల తేడాతో చిత్తై ఓటమితో ఈ టోర్నమెంట్‌ను ఆరంభించింది. అంతేకాదు.. బుధవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ బృందం టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు ఒకటి నమోదు చేసింది.
గత చాంపియన్స్ ట్రోఫీ-2017 ఎడిషన్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ చేరకపోయినా డిఫెండింగ్ హోదాలో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఇందులో భాగం కానుంది.
యంగ్, లాథమ్ సెంచరీలు
ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్- న్యూజిలాండ్ కరాచీ వేదికగా తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు దంచికొట్టారు.
ఓపెనర్ విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులతో దుమ్ములేపగా.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత అజేయ శతకం(104 బంతుల్లో 118* రన్స్) సాధించాడు. ఇక ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో చెలరేగాడు.
ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు కివీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. విలియం ఓరూర్కీ ఓపెనర్ సౌద్ షకీల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(3)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు.
పాక్ చెత్త రికార్డు
ఈ క్రమంలో మరో ఓపెనర్ బాబర్ ఆజం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఈ వన్డే మ్యాచ్ పవర్‌ప్లే(తొలి పది ఇన్నింగ్స్)లో రెండు వికెట్ల నష్టానికి కేవలం 22 పరుగులే చేసింది పాకిస్తాన్. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధికంగా మూడుసార్లు.. 25 కంటే తక్కువ సోర్లు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది.
ప్రపంచంలో ఈ చెత్త రికార్డు సాధించిన టీమ్‌గా పాక్ చరిత్రకెక్కింది. ఇక పాకిస్తాన్‌కు సొంతగడ్డపై వన్డే చరిత్రలో పవర్‌ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లు
పాకిస్తాన్- 2013లో జింబాబ్వేపై బర్మింగ్‌హామ్ వేదికగా 18/2
పాకిస్తాన్- 2025లో న్యూజిలాండ్‌పై కరాచీ వేదికగా 22/2
పాకిస్తాన్- 2013లో వెస్టిండీస్‌పై ది ఓవల్ వేదికగా 23/3
బంగ్లాదేశ్- 2017లో న్యూజిలాండ్‌పై కార్డిఫ్ వేదికగా 24/3
శ్రీలంక- 2013లో ఇండియాపై కార్డిఫ్ వేదికగా 26/1.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్‌లో బాబర్ ఆజం 90 బంతుల్లో 64 పరుగులు చేయగా.. ఫఖర్ జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. అయితే, ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69), సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడటంతో పాక్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ కివీస్ బౌలర్లు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు.
నాథన్ స్మిత్ సల్మాన్‌ను, ఖుష్దిల్‌ను విలియం పెవిలియన్‌కు పంపారు. దీంతో పాకిస్తాన్ కథ కంచికి చేరకుండానే ముగిసిపోయింది. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో విలియం ఓరూర్కీ,కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. మ్యాట్ హెన్రీ రెండు, మైఖేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment