కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి.
మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్‌లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్
1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు
త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు.
2. పన్ను మినహాయింపులు
పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు.
3. నూతన సంక్షేమ పథకాలు
కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్‌డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్‌లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది.
4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు
ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు.
5. నూతన ఆర్థిక విధానాలు
చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్‌లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
అయినా కొన్ని అంచనాలు..
1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు.
2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్‌లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం.
4. గత బడ్జెట్‌లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి..
5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు.
6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment