కేంద్రబడ్జెట్‌.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. | Interesting Facts About Union Budget 2024 | Sakshi
Sakshi News home page

కేంద్రబడ్జెట్‌.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..

Published Mon, Jan 29 2024 10:54 AM | Last Updated on Tue, Jan 30 2024 4:52 PM

Interesting Facts About Union Budget 2024 - Sakshi

బడ్జెట్‌ 2024-25ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో కీలకమైన కొన్ని బడ్జెట్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

స్వాతంత్య్రం రాకముందే బడ్జెట్‌..
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్‌ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ఇండియా స్కాటిష్‌ ఆర్థికవేత్త జేమ్స్‌ విల్సన్‌ బడ్జెట్‌ను బ్రిటిష్‌ రాణికి సమర్పించారు.

స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌..
స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.

ప్రధానమంత్రులు..
జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అత్యధిక సార్లు ప్రవేశపెట్టినవారు..
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ బడ్జెట్‌ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962-69 మధ్య 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాలల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్‌ సిన్హా 8 సార్లు, మన్మోహన్‌ సింగ్‌ 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్‌ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.

బడ్జెట్‌ సమయం మార్పు..
1999 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరిలో చివరి పనిదినాన, సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే, ఆర్థిక శాఖ మాజీ  మంత్రి యశ్వంత్‌ సిన్హా బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్పు చేసి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.

బడ్జెట్‌ తేదీ మార్పు..
బడ్జెట్‌ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే, 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు.

అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్‌లు..
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్‌ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్‌ ముల్జీ భాయ్‌ పటేల్‌ సమర్పించిన బడ్జెట్‌ అతిచిన్నది. ఆ బడ్జెట్‌లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.

సుదీర్ఘ ప్రసంగం..
ప్రస్తుత  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది.

బడ్జెట్‌ లీక్‌..
1950 సంవత్సరంలో యూనియన్‌ బడ్జెట్‌ లీక్‌ అయ్యింది. లీక్‌ కారణంగా అప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే బడ్జెట్‌ను, దిల్లీలోని మింట్‌రోడ్‌కు మార్చారు. 1980లో నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. 1995 వరకు బడ్జెట్‌ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ సిద్ధం చేయించింది.

పేపర్‌లెస్‌ బడ్జెట్‌..
2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మొదటి సారిగా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను సమర్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.

రైల్వే బడ్జెట్‌ విలీనం..
2017కు ముందు వార్షిక బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ రెండింటిని విలీనం చేశారు.

ఇదీ చదవండి: బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..!

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళలు..
ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement