న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు.
‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందరి ఇళ్లు
‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.
పరిశ్రమ డిమాండ్లు..
షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్‌లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు.
మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్‌లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
ప్రోత్సాహకరం..
బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు.
ఎన్నో సానుకూలాంశాలు..
ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష
కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది
గొప్ప బడ్జెట్.
– సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ.
ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు..
సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్‌లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది.
– ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్
భవిష్యత్తును ప్రతిబింబించేలా..
60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది.
– జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్
ఆవిష్కరణలకు దన్ను..
దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి.
– సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్
నిబద్ధతను ప్రతిబింబిస్తుంది..
వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్‌కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
– çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో
Comments
Please login to add a commentAdd a comment