న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది.
అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.
ఇదీ తీరు..
డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్‌ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌వీఎన్‌ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్‌ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment