
విద్యా దానంతో మేలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి సెప్టెంబర్ 5వ తేదీని ‘విద్య విషయంలో అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని, ప్రజా చైతన్యం కలిగించాలని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానించడం ఆహ్వానించదగ్గ అంశమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి సుఖబోధానంద అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ విద్యనందించడానికి దాతలు, పారిశ్రామికవేత్తలు, ఉదార స్వభావులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒక కార్పొరేట్ శిక్షణ కార్యక్రమంలో పలువురు శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు హైదరాబాద్ వచ్చిన స్వామి సుఖబోధానంద మాట్లాడుతూ, ‘ఇతరులకు విద్యనందించాలనే మంచి మనసు ఉంటే చాలు... అది చివరకు మన మనసుకు చక్కటి చదువుగా ఉపకరిస్తుంది. హృదయ వికాసానికి తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి. దాని వల్ల సమాజంలో ఎంతోమంది మానసికంగా పైకి ఎదుగుతారు.
అలా ఒక వ్యక్తిలోని అత్యుత్తమ గుణాలను బయటకు తీసుకురాగలుగుతాం’ అని ఉద్బోధించా రు. సికింద్రాబాద్, బెంగుళూరుతో సహా వివిధ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో అవసరార్థులకు సేవలందిస్తున్న ‘ప్రసన్న ట్రస్ట్’ సంస్థాపక చైర్మన్ అయిన స్వామీజీ, ‘అత్యుత్తమ గుణాలను వెలికి తీసురావడానికి ఉపకరించే ఈ విద్యా దానమనే మంచి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని అభ్యర్థించారు.