Public consciousness
-
అడ్డంకులెదురైనా ఆగేదిలేదు
స్ఫూర్తి యాత్ర ద్వారా ప్రజా చైతన్యం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్ఫూర్తియాత్రకు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటాలు ఆగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. స్ఫూర్తియాత్ర ద్వారా ఉద్యమ ఆకాంక్షల అమలుకోసం ప్రజలను చైతన్యం చేయాలనుకున్నామని అన్నారు. ప్రజలు తమ అధికారాలు తెలుసుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. యాత్రను అడ్డుకుని, సభలు నిర్వహించుకునే హక్కుపై ప్రభుత్వమే దాడికి పాల్పడిందని కోదండరాం విమర్శించారు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం జేఏసీ చట్టబద్ధంగా ఎదిరించిందన్నారు. జేఏసీ యాత్రకు, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు, పోరాటానికి అనేక పార్టీలు, ప్రజాసంఘాలు అండగా నిలిచాయన్నారు. మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పూర్తి యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేసిన విద్యార్థి సంఘాలకు, తోడ్పాటు అందించిన ప్రజాసంఘాలకు, మద్దతునిచ్చిన బీజేపీ, సీపీఎంకు కోదండరాం కృతజ్ఞతలను తెలియజేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. -
విద్యా దానంతో మేలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి సెప్టెంబర్ 5వ తేదీని ‘విద్య విషయంలో అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని, ప్రజా చైతన్యం కలిగించాలని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానించడం ఆహ్వానించదగ్గ అంశమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి సుఖబోధానంద అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ విద్యనందించడానికి దాతలు, పారిశ్రామికవేత్తలు, ఉదార స్వభావులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక కార్పొరేట్ శిక్షణ కార్యక్రమంలో పలువురు శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు హైదరాబాద్ వచ్చిన స్వామి సుఖబోధానంద మాట్లాడుతూ, ‘ఇతరులకు విద్యనందించాలనే మంచి మనసు ఉంటే చాలు... అది చివరకు మన మనసుకు చక్కటి చదువుగా ఉపకరిస్తుంది. హృదయ వికాసానికి తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి. దాని వల్ల సమాజంలో ఎంతోమంది మానసికంగా పైకి ఎదుగుతారు. అలా ఒక వ్యక్తిలోని అత్యుత్తమ గుణాలను బయటకు తీసుకురాగలుగుతాం’ అని ఉద్బోధించా రు. సికింద్రాబాద్, బెంగుళూరుతో సహా వివిధ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో అవసరార్థులకు సేవలందిస్తున్న ‘ప్రసన్న ట్రస్ట్’ సంస్థాపక చైర్మన్ అయిన స్వామీజీ, ‘అత్యుత్తమ గుణాలను వెలికి తీసురావడానికి ఉపకరించే ఈ విద్యా దానమనే మంచి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని అభ్యర్థించారు.