
అడ్డంకులెదురైనా ఆగేదిలేదు
స్ఫూర్తి యాత్ర ద్వారా ప్రజా చైతన్యం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్ఫూర్తియాత్రకు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటాలు ఆగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. స్ఫూర్తియాత్ర ద్వారా ఉద్యమ ఆకాంక్షల అమలుకోసం ప్రజలను చైతన్యం చేయాలనుకున్నామని అన్నారు. ప్రజలు తమ అధికారాలు తెలుసుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. యాత్రను అడ్డుకుని, సభలు నిర్వహించుకునే హక్కుపై ప్రభుత్వమే దాడికి పాల్పడిందని కోదండరాం విమర్శించారు.
ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం జేఏసీ చట్టబద్ధంగా ఎదిరించిందన్నారు. జేఏసీ యాత్రకు, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు, పోరాటానికి అనేక పార్టీలు, ప్రజాసంఘాలు అండగా నిలిచాయన్నారు. మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పూర్తి యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేసిన విద్యార్థి సంఘాలకు, తోడ్పాటు అందించిన ప్రజాసంఘాలకు, మద్దతునిచ్చిన బీజేపీ, సీపీఎంకు కోదండరాం కృతజ్ఞతలను తెలియజేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.