
సాక్షి, హైదరాబాద్: కోదండరాం మరోమారు కాంగ్రెస్ పార్టీ చేయిపట్టి నడవాలని నిర్ణయించుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసిన ఆయన ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ పక్షానే నిలబడ్డారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తాయని, కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన ప్రకటించారు. టీజేఎస్ మద్దతిచ్చేందుకు ఆరు డిమాండ్లను కాంగ్రెస్ ముందుంచారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధాన రూపకల్పనలో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
రేవంత్, ఠాక్రేతో చర్చలు..
ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన కోదండరాం ఎన్నికల వేళ మళ్లీ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు నాంపల్లిలోని టీజేఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ధర్మార్జున్ తదితరులతో గంటకుపైగా చర్చించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గత పదేళ్లుగా టీజేఎస్, కోదండరాం పోరాడుతున్నందున తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే వారి సహకారం అవసరమని రేవంత్ కోరారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని, ఎన్నికల క్షేత్రంలో ఇరు పార్టీల శ్రేణులు కలసి పనిచేసేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కోదండరాం కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు అంగీకరించారు.
చర్చల్లో భాగంగా టీజేఎస్ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చించారు. సీట్లు కేటాయించాలంటే ఇప్పుడు మళ్లీ అధిష్టానంతో మాట్లాడాల్సి ఉంటుందని, ఈసారికి పోటీ లేకుండానే మద్దతివ్వాలని రేవంత్ తదితరులు కోదండరాం, టీజేఎస్ నేతలను కోరారు. వీలునుబట్టి ఇప్పటికైనా అవకాశం ఉన్న చోట పోటీకి అంగీకరించాలని, లేకపోయినా తమ మద్దతు ఇస్తామని టీజేఎస్ పక్షాన స్పష్టం చేశారు.
అండగా ఉంటామన్నారు: రేవంత్
ఇరు పార్టీల చర్చల అనంత రం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రజాప్రభు త్వం ఏర్పాటు చేసేందుకు టీజేఎస్‌తో కలసి ముందుకెళతామన్నారు. టీజేఎస్ డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని నెరవేర్చడం కోసం సమన్వయ కమిటీని నియమించుకుంటామని చెప్పారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు కోదండరాంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ అధిష్టానం సూచ న మేరకు ఆయన్ను కలసి మద్దతివ్వాలని కోరినట్లు వివరించారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటా మని కోదండరాం హామీ ఇచ్చారని, సీట్లు ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు.
మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు
రాష్ట్రంలో కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్పారు. తమ ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు హ్యాక్ చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నియంత్రించాలన్న ఆలోచనలతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారన్నారు. తమకు సహకరించాలనుకుంటున్న వారిని బెదిరిస్తున్నారని, తాము ప్రైవేటుగా మాట్లాడిన మాటలను వింటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎంఐఎం, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
టీజేఎస్ 6 డిమాండ్లు ఇవే..
- అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి.
- ఉపాధి, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. ఏ సంవత్సరం ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేయాలి. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించాలి.
- సంప్రదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత కల్పించాలి. చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి.
- వాస్తవ వ్యవసాయ సాగుదారులను గుర్తించాలి. చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించాలి. భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
- ప్రజాస్వామిక పాలన నెలకొల్పాలి. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, పేదలకు పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి.
- ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు సమగ్ర సాయం అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment