Thackeray
-
ఓ వైపు పాలన.. మరోవైపు పదవులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు కీలక టాస్క్‌లు ఎదుర్కోబోతున్నారు. ఓ వైపు పాలనతో పాటు మరోవైపు పదవుల పందేరం కూడా ఆయనకు పెద్ద పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక పదేళ్లు కావడం, తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో వేలాది మంది పార్టీ నేతలు పదవుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరికి పోస్టుల పంపిణీ ఒక ఎత్తయితే ఆ పదవుల పందేరం ఫలితంగా ఎదుర్కొనే పరిస్థితులను సమన్వయం చేయాల్సి ఉండడం పెద్ద టాస్క్ అనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పదవుల పంపిణీతో పాటు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించి తనదైన మార్కు పరిపాలన అందించడం కోసం రేవంత్ జోడెడ్ల స్వారీ చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీనే కీలకం...: రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం మొదలు నుంచి సీఎంగా ఎంపికయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కొందరు నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం వద్ద పట్టుపట్టి తామూ కీలకం అన్న ’గుర్తింపు’సాధించడంలో సఫలీకృతులయ్యారన్న వాదనలూ ఉన్నాయి. ఇందుకోసం అధిష్టానం పెద్దలు కూడా సహకరించారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఏకాభిప్రాయంతో కూడిన సానుకూలత ఉన్నప్పటికీ సొంత పార్టీలోని కొందరు నాయకుల వైఖరి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతోనే హైకమాండ్ రాజీధోరణిని అందిపుచ్చుకుందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. ఈ ధోరణి మరికొన్నాళ్లు కొనసాగుతుందని, పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, తనదైన మార్కు వేసేంతవరకు పార్టీలోని సీనియర్లతో సీఎం రేవంత్‌కు సమన్వయం తప్పదని చెపుతున్నాయి. ఠాక్రేతో పాటు సీనియర్లను సమన్వయం చేసుకునే.. ఇప్పటికే మంత్రివర్గం కూర్పు, శాఖల పంపిణీలో కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మార్కు రాజకీయాలు స్పష్టం కాగా, భవిష్యత్తులో జరిగే నామినేటెడ్ పదవుల పంపకంలోనూ హైకమాండ్ జోక్యం ఉంటుందని చెబుతున్నారు. హైకమాండ్ సూచనల మేరకు సీనియర్ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలపై ఆయన సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పదవుల పందేరం కోసం రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని అధిష్టానం ప్రతిపాదించిందని సమాచారం. -
కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
మళ్లీ ‘చేయి’ కలిపిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కోదండరాం మరోమారు కాంగ్రెస్ పార్టీ చేయిపట్టి నడవాలని నిర్ణయించుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసిన ఆయన ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ పక్షానే నిలబడ్డారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తాయని, కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన ప్రకటించారు. టీజేఎస్ మద్దతిచ్చేందుకు ఆరు డిమాండ్లను కాంగ్రెస్ ముందుంచారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధాన రూపకల్పనలో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రేవంత్, ఠాక్రేతో చర్చలు.. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన కోదండరాం ఎన్నికల వేళ మళ్లీ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు నాంపల్లిలోని టీజేఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ధర్మార్జున్ తదితరులతో గంటకుపైగా చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గత పదేళ్లుగా టీజేఎస్, కోదండరాం పోరాడుతున్నందున తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే వారి సహకారం అవసరమని రేవంత్ కోరారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని, ఎన్నికల క్షేత్రంలో ఇరు పార్టీల శ్రేణులు కలసి పనిచేసేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కోదండరాం కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు అంగీకరించారు. చర్చల్లో భాగంగా టీజేఎస్ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చించారు. సీట్లు కేటాయించాలంటే ఇప్పుడు మళ్లీ అధిష్టానంతో మాట్లాడాల్సి ఉంటుందని, ఈసారికి పోటీ లేకుండానే మద్దతివ్వాలని రేవంత్ తదితరులు కోదండరాం, టీజేఎస్ నేతలను కోరారు. వీలునుబట్టి ఇప్పటికైనా అవకాశం ఉన్న చోట పోటీకి అంగీకరించాలని, లేకపోయినా తమ మద్దతు ఇస్తామని టీజేఎస్ పక్షాన స్పష్టం చేశారు. అండగా ఉంటామన్నారు: రేవంత్ ఇరు పార్టీల చర్చల అనంత రం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రజాప్రభు త్వం ఏర్పాటు చేసేందుకు టీజేఎస్‌తో కలసి ముందుకెళతామన్నారు. టీజేఎస్ డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని నెరవేర్చడం కోసం సమన్వయ కమిటీని నియమించుకుంటామని చెప్పారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు కోదండరాంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ అధిష్టానం సూచ న మేరకు ఆయన్ను కలసి మద్దతివ్వాలని కోరినట్లు వివరించారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటా మని కోదండరాం హామీ ఇచ్చారని, సీట్లు ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు రాష్ట్రంలో కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్పారు. తమ ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు హ్యాక్ చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నియంత్రించాలన్న ఆలోచనలతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారన్నారు. తమకు సహకరించాలనుకుంటున్న వారిని బెదిరిస్తున్నారని, తాము ప్రైవేటుగా మాట్లాడిన మాటలను వింటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎంఐఎం, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. టీజేఎస్ 6 డిమాండ్లు ఇవే.. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. ఏ సంవత్సరం ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేయాలి. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించాలి. సంప్రదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత కల్పించాలి. చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. వాస్తవ వ్యవసాయ సాగుదారులను గుర్తించాలి. చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించాలి. భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక పాలన నెలకొల్పాలి. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, పేదలకు పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు సమగ్ర సాయం అందించాలి. -
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
70 సీట్లలో వడపోత పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాలకు సంబంధించి వడపోతను పూర్తి చేసినట్టు తెలిసింది. ఇందులో నలభైకి పైగా సీట్లకు ఒక్కో అభ్యర్థి పేరును, మరో 30 సీట్లకు ఇద్దరి పేర్ల చొప్పున ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇద్దరేసి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా స్థానాల్లోనూ సర్వేల ప్రకారం పరిశీలన జరిపి షార్ట్ లి‹స్ట్ చేయడం కొలిక్కి వచ్చిందని అంటున్నాయి. నిర్ణయాధికారం కేంద్ర కమిటీకే.. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజూ నేతల భేటీ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతోపాటు ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. గురువారం భేటీలో 35 వరకు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు చర్చించి మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంతోపాటు, ఇంకో 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ లిస్టులో ఎల్బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది. వీటికి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వేలతోపాటు ఏఐసీసీ తరఫున చేయించిన ఇతర సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 50 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం కమిటీ మరోమారు భేటీ కానుందని అంటున్నాయి. రేవంత్‌ను కలసిన రేఖానాయక్, వేముల వీరేశం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు ఏఐసీసీ, పీసీసీ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ఉదయం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రేవంత్‌ను కలిశారు. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో షర్మిల పర్యటనపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య విభేదాలు ఢిల్లీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు వాడీవేడిగా సాగినట్టు తెలిసింది. 40 స్థానాలు మినహా.. మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. కొన్ని స్థానాలపై చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు చేసుకున్నట్టు తెలిసింది. ‘అసలు కాంగ్రెస్, వలస నేతలు’ అన్న ప్రాతిపదికన ఈ వాగ్వాదం జరిగిందని.. ఎన్నారైలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పేర్లను సీఈసీకి పంపే విషయంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. మెజార్టీ సభ్యులు ఒక్క పేరే సూచించిన పలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థి ఎంపిక ఫైనల్ కాలేదని.. అలాంటి స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కొందరు నేతలు పట్టు బట్టినట్టు తెలిసింది. ఈ విషయంపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో ఏం జరిగిందని తెలుసు కున్న తర్వాత చాలా స్థానాలౖపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితే కనిపించడం లేదు. హైకమాండ్ కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. చివరికి ఎవరి పేర్లు వాళ్లు పంపేలా ఉన్నారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
పూర్తి కాకుండానే ’పాలమూరు’ను ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పనులు పూర్తి కాకుండానే ఈనెల 16న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఈ ప్రాజెక్టులో మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క పంపును ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందా అని ఎద్దేవా చేశారు. సోమవారం గాందీభవన్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆమెను ఆహ్వనించిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ గతంలో సీతా దయాకర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారని, తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగితే, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కలి్పస్తోందని, సీతాదయాకర్‌రెడ్డికి రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన తిమ్మాపూర్ నేతలు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్‌తో సహా పలువురు కార్యకర్తలను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కండువాకప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వనించారు. -
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.