70 సీట్లలో వడపోత పూర్తి! | Telangana Elections: Congress likely to finalise candidates by Dussehra | Sakshi
Sakshi News home page

70 సీట్లలో వడపోత పూర్తి!

Sep 23 2023 3:24 AM | Updated on Sep 23 2023 8:18 PM

Telangana Elections: Congress likely to finalise candidates by Dussehra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ.. భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాలకు సంబంధించి వడపోతను పూర్తి చేసినట్టు తెలిసింది.

ఇందులో నలభైకి పైగా సీట్లకు ఒక్కో అభ్యర్థి పేరును, మరో 30 సీట్లకు ఇద్దరి పేర్ల చొప్పున ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఇద్దరేసి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. మిగతా స్థానాల్లోనూ సర్వేల ప్రకారం పరిశీలన జరిపి షార్ట్‌ లి‹స్ట్‌ చేయడం కొలిక్కి వచ్చిందని అంటున్నాయి.

నిర్ణయాధికారం కేంద్ర కమిటీకే..
అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజూ నేతల భేటీ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతోపాటు ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

గురువారం భేటీలో 35 వరకు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు చర్చించి మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్‌ చేయడంతోపాటు, ఇంకో 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది.

ఈ లిస్టులో ఎల్‌బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్‌ తదితర నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది.

వీటికి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్‌ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. సునీల్‌ కనుగోలు బృందం చేసిన సర్వేలతోపాటు ఏఐసీసీ తరఫున చేయించిన ఇతర సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 50 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం కమిటీ మరోమారు భేటీ కానుందని అంటున్నాయి.

రేవంత్‌ను కలసిన రేఖానాయక్, వేముల వీరేశం
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు ఏఐసీసీ, పీసీసీ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ శుక్రవారం ఉదయం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రేవంత్‌ను కలిశారు. మరోవైపు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా ఢిల్లీలోనే ఉండటంతో షర్మిల పర్యటనపై ఆసక్తి నెలకొంది. 

అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య విభేదాలు
ఢిల్లీ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు వాడీవేడిగా సాగినట్టు తెలిసింది. 40 స్థానాలు మినహా.. మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. కొన్ని స్థానాలపై చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు చేసుకున్నట్టు తెలిసింది.

‘అసలు కాంగ్రెస్, వలస నేతలు’ అన్న ప్రాతిపదికన ఈ వాగ్వాదం జరిగిందని.. ఎన్నారైలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పేర్లను సీఈసీకి పంపే విషయంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. మెజార్టీ సభ్యులు ఒక్క పేరే సూచించిన పలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థి ఎంపిక ఫైనల్‌ కాలేదని.. అలాంటి స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కొందరు నేతలు పట్టు బట్టినట్టు తెలిసింది.

ఈ విషయంపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో ఏం జరిగిందని తెలుసు కున్న తర్వాత చాలా స్థానాలౖపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితే కనిపించడం లేదు. హైకమాండ్‌ కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. చివరికి ఎవరి పేర్లు వాళ్లు పంపేలా ఉన్నారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement