సత్తెనపల్లి: తమ గ్రామం ఆదర్శంగా ఉండాలని, ప్రజలందరూ కలిసి పార్టీలకతీతంగా పాలకులనుఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజారానాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. అయినా నిధుల జాడలేదు. రోడ్లు, కాల్వలు, అధ్వానంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం లోపించింది.
నిధులు లేక గ్రామాల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు తలలుపట్టుకుంటున్నారు. కులమతాలకు, వర్గ విభేదాలకు తావులేకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు 2006లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నజరానా ప్రవేశపెట్టారు.
మేజరు పంచాయతీకి రూ.15 లక్షలు, మైనర్ పంచాయతీకి రూ.7 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. ఆ నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులకు వినియోగించే వారు. ప్రస్తుతం ప్రభుత్వమిచ్చే నజరానాల కోసం ఏకగ్రీవ పంచాయతీలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుత శాసనమండలి సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవమైన పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుండగా ఇంకా త్వరలో అంటూ ప్రకటనలు చేయడం నిధుల విడుదలపై సందేహాలకు తావిస్తోంది.
సమస్యలే నజరానా..
సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో ప్రజలు తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వంటి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించ వచ్చని ఆశపడ్డ సర్పంచ్‌ల ఆశలు ఫలించలేదు. నజరానాల కోసం నిరీక్షణ తప్పలేదు.
ప్రభుత్వం చొరవ చూపాలి...
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆలస్యంగానైనా ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా వస్తుందని ఎదురు చూస్తున్నాం. పంచాయతీలో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఏపని చేయాలన్నా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రోత్సాహక నగదు అందితేనే సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి.
- చెవులు వకులేశ్వరరావు, సర్పంచ్, కట్టావారిపాలెం
నజరానాల ఊసేది?
ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ఏడాది గడిచినా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. చాలీచాలని నిధులతో గ్రామంలో మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నా. నజరానా నిధులు మంజూరైతే గ్రామాల్లో శాశ్వత పనులకు ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని నమ్మి ప్రజలంతా సమష్టిగా నన్ను ఎన్నుకున్నారు.త్వరితగతిన ప్రభుత్వ నిధులు విడుదల చేయాలి.
-ఎస్‌కె.మహబూబ్ బీ, సర్పంచ్, మొక్కపాడు