సహయం కోసం నిరీక్షణ
సహయం కోసం నిరీక్షణ
Published Sun, Jul 16 2017 10:57 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
కంటి చూపు కోల్పోయిన బాధితుల వేదన
స్పందించని అధికారులు, లయన్స్ క్లబ్ వర్గాలు
పరామర్శలే తప్ప సహాయం లేదు
నేడు అమెరికా నుంచి రానున్న క్లబ్ బృందం
సామర్లకోట (పెద్దాపురం) : కంటి చూపు కోల్పొయిన బాధితులకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి లేదా లయన్స్ క్లబ్ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. దీంతో బాధితులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీన వేట్లపాలెం గ్రామానికి చెందిన 10 మంది జగ్గంపేట వెళ్లి కోడూరి రంగారావు లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకోవడం, వారి చూపు మందగించడం విదితమే. బాధితులు మూడు నెలల పాటు వారి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి విలేకరులను ఆశ్రయించారు. అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు తగిన అన్యాయంపై న్యాయం చేస్తారని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది.
వేట్లపాలెం గ్రామంలో ఒక చర్చిలో ప్రార్థనలు చేసుకుంటోన్న సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తోందని, అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేస్తామని ప్రకటించడంతో ఈ బాధితులు వైద్యం కోసం వెళ్లారు. మసకగా ఉన్న కంటి చూపు మెరుగుపడుతుందని ఆశించిన వారికి కంటి చూపే పొయింది. ఈ గ్రామస్తులు రామిశెట్టి సత్యవతి, బావిశెట్టి రాంబాయి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, గొడత రామకృష్ణ, బొండా సత్యానందం, దోణం పెద్దిరాజులకు కంటి ఆపరేషన్లు చేయడంతో వారికి ఉన్న చూపు కోల్పోయిన విషయం విదితమే. చూపు కనిపించకపోవడమే కాకుండా కంటిలో ఈగలు తిరుగుతున్న ఉందని బాధితులు వాపోతున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ నెల 5న బాధితులను పరామర్శించి ప్రభుత్వ కంటి వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి వైద్యం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కంటి చూపు పోయిన వారి పట్ల సానుభూతి చూపించేవారే తప్ప వారికి సహాయం చేసేవారు లేకుండా పోయారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేటలోని కోడూరి రంగారావు లయన్స్ ఆస్పత్రి ప్రతినిధులు అమెరికాలోని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సమావేశాలకు వెళ్లారని, వారు వచ్చిన తరువాత బాధితులకు న్యాయం చేస్తామని లయన్ప్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆమెరికా ప్రతినిధి బృందం సోమవారం జిల్లాకు వస్తారనే ప్రచారం సాగుతోంది. వారు వచ్చిన తరువాత అయినా బాధితులకు సరైన న్యాయం చేస్తారా లేదో చూడాలని గ్రామస్తులు అంటున్నారు.
Advertisement
Advertisement