ఈయన పేరు నడిపి రాజం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుబండిని లాగుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజంతా కష్టపడితే వచ్చేది రూ.400. అదీ పని దొరికితే! కూలీ లేని సమయంలో భార్య బీడీలు చుడుతుంది. కొడుకు చదువు, పండుగలూపబ్బాలు, ఉప్పూపప్పు.. మిగతా ఖర్చులన్నీ వచ్చే కాస్త సంపాదనతోనే తీర్చుకోవాలి. ‘‘అన్నీ రేట్లు పెరిగిపోతున్నయి. బియ్యం.. కూరగాయల ధరలు మండిపోతున్నయ్. వాటికే నెలకు రూ.3–5 వేల ఖర్చు వస్తుంది. తిండికే మస్తు తక్లీబు అయితంది’’అని రాజం వాపోయాడు. ఈయనలాంటివారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పనిదొరికితే తిండి లేదంటే.. పస్తులు ఉంటున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చి, ఎన్ని మారినా వీరి తలరాతలు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం తమలాంటి గరీబోళ్లను ఆదుకోవాలని, రోజువారీ సరుకుల ధరలు తగ్గించాలని వీరంతా కోరుతున్నారు. మరి జైట్లీ తన బడ్జెట్‌లో వీరికోసం ఏం చేస్తారు..? సుస్థిర ఉపాధికి ఏం భరోసా ఇస్తారు..? వేచి చూడాల్సిందే..!!
Comments
Please login to add a commentAdd a comment