రైతు పంట పండింది | formers crops grown sucessfully | Sakshi
Sakshi News home page

రైతు పంట పండింది

Published Sat, Jan 11 2014 2:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

formers crops grown sucessfully

తమలపాకులు పచ్చగా ఉండి... వక్క, సున్నంతో కలిపి నోరెలా ఎర్రగా పండిస్తుందో.. ఇప్పుడు తోటలోనూ బాగా పండి.. రైతు ఇంట పచ్చ‘ధనం’ కురిపిస్తోంది. వర్షాలకు కోస్తాంధ్రలో పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ఆకులకు కొరత ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ధర చుక్కలనంటింది. ఇంకేముంది రైతు పంట పండింది. ఒక కోత కోసే సరికి కాసుల వర్షం కురుస్తోంది. ‘తంతే తమలపాకు బుట్టలో పడడం’ అంటే ఇదేనేమో.    
 - న్యూస్‌లైన్, చెన్నూరు
 
 తమలపాకులు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెట్‌లో ఒక్కసారిగా భారీగా ధరలు పెరగడంతో రైతులకు కాసుల పంట పండిస్తున్నాయి. ‘వేస్తే తమలపాకు తోటలే వేయాలిరా’ అన్నట్లు తమలపాకు ధరలు పలుకుతున్నాయి.
 
 అక్కడ కన్నీళ్లు.. ఇక్కడ కాసులు
 రెండు, మూడు నెలల కిందట వచ్చిన వరుస తుపానుల ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి వేల ఎకరాల్లో ఆకుతోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో ఇక్కడి తమలపాకులకు భలే గిరాకీ వచ్చింది.  వర్షం అక్కడి రైతులకు కన్నీళ్లు మిగిలిస్తే.. ఇక్కడి రైతులకు కాసుల పంట పండిస్తోంది.
 
 చుక్కలనంటిన ధరలు..
 గత నెల 25వతేదీ  వరకు రూ.200 నుంచి 300లు ఉన్న ఆకుల బుట్ట (25 సట్టలు) ఇప్పుడు నాణ్యతను బట్టి రూ.600 నుంచి 900 పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తమలపాకుల ఉత్పత్తి భారీగా పడిపోవడం అంతర రాష్ట్రీయంగా డిమాండు పెరగడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
 
 చెన్నై, మహారాష్ట్రలకు ఎగుమతులు
 రైతులు తమలపాకులను మహారాష్ట్ర, చెన్నై, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. 70 శాతం మేర మహారాష్ట్రలోని సోలాపూర్, శాంగ్లి, కొల్హాపూర్, బీజాపూర్, బెల్గాం, బార్సి, ముంబాయిలకు తరలిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడికి వెయ్యి బుట్టలకు పైగా పంపుతున్నారు.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లారీల్లో వీటిని తరలిస్తారు. పెరిగిన ధరలతో బాగా ఉన్న తమలపాకు తోటలకు నెలకు ఒక కోతకే ఎకరానికి రూ.60 వేల నుంచి లక్ష వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
 తెగుళ్లను నివారిస్తే పూర్వ వైభవం
 ఒకప్పుడు చెన్నూరు అంటేనే తమలపాకు తోటలు గుర్తొస్తాయి. అంత ప్రసిద్ధి చెందిన చెన్నూరులో రానురానూ ఆకుతోటల సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది.  సుమారు 3 వేల ఎకరాల్లో ఉండే సాగు ప్రస్తుతం 500 ఎకరాలకు పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తోటలకు బూజు తెగుళ్లు ఆశించడం.. ధరలు లేకపోవడం.. దీనికితోడు అధికారులు తెగుళ్ల నివారణకు సరైన చర్యలు సూచించకపోవడంతో పాటు ఈ పంటకు బీమా సౌకర్యం లేనందున రైతులు వీటి సాగుపై ఆసక్తి తగ్గించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు బీమా సౌకర్యం కలిపిస్తే చెన్నూరులో తమలపాకుతోటలకు పూర్వవైభవం వస్తుందని రైతులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement