ఉపాధికి ఊతమిస్తా
వానల్లేవ్..బోరు బావుల్లో చుక్కనీరు లేదు..పొలాలన్నీ బీళ్లు..ఊరు ఊరంతా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస బాట పట్టింది. ఊళ్లో పెద్ద పెద్ద మిద్దెలున్నా కాపురాలు లేక పాడుబడిపోయాయ్. ఒకటి కాదు రెండు కాదు.. 50 ఎకరాలున్న రైతు సైతం కరువు దెబ్బకు విలవిల్లాడాడు. బెంగళూరుకు వెళ్లి సెక్యూరిటీ గార్డు గానో..హోటళ్లో సప్లయర్‌గానో స్థిరపడిపోయారు. ఇలాంటి దుర్భక్ష పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ ఊరే కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలంలో ఉన్న బండ్రేపల్లి. శనివారం ఈ ఊరిని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ హోదాలో సందర్శించారు. అక్కడున్న వారితో మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు.
బండ్రేపల్లి గ్రామంలోకి ఓ కారు వచ్చి ఆగింది. అక్కడే చింత చెట్టుకింద ఉన్న కొందరు రైతులు కారు దగ్గరకు వచ్చేందుకు లేవబోయారు. అంతలో ఆ కారులో నుండి వచ్చిన వీఐపీ రిపోర్టర్ అత్తార్ చాంద్‌బాషా ‘సాక్షి’ లోగో చేతబట్టుకొని వారితో ఇలా పలకరించారు. చాంద్‌బాషా : ఏం అన్నా బాగున్నావా? నీ పేరేంటి? ఏం తీరిగ్గా కూచున్నారే?
వెంకటరెడ్డి: నాపేరు వెంకటరెడ్డి సార్..ఏం బాగో ఏమో. యా ఊరు ఎట్లుందో మాకు తెలీదు గానీ మా ఊరు మాత్రం పూర్తి అధ్వానంగా ఉంది. వానలు లేక బోర్లన్నీ ఎండిపోయినాయి. నాగ్గూడా 20 ఎకరాలుంది. ఏం జేద్దాం. బోర్లో చుక్క నీళ్లు లేవు. మేమే ఇంతకు ముందు పది మందికి అన్నం బెడతాంటిమి. ఇబ్బుడు మేమే అన్నం అడుక్కునే పరిస్థితి వచ్చింది. నా కొడుకు, కోడలు ఇద్దరూ బెంగుళూరుకు పోయి సెరి ఒకతావ సెక్కూరిటి గార్డుగా పని జేత్తాండారు. ఏం జేస్తాం. కాలం అట్ల వచ్చింది.
చాంద్‌బాషా: (ఓ ముసలాయమ్మను చూస్తూ) ఏం పెద్దమ్మా.. ఇంట్లో ఒక్కరే ఉన్నారే..ఎంత మంది పిల్లలు?
వెంకటరమణమ్మ: నాకు ఐదు మంది కూతుర్లు, ఒక కొడుకు నాయనా..అందరికీ పెండ్లిండ్లు అయిపోయినాయి. కొడుకు, కోడలు ఇద్దరూ బెంగుళూరుకు పోయినారు. అక్కడ ఏందో కూలీ, నాలీ చేసుకుంటూ నాకూ నూరో ఇన్నూరో పంపిస్తారు.
చాంద్‌బాషా: మీకు యెన్నెకరాల భూములున్నాయి?
వెంకటరమణమ్మ: మాకు 40 ఎకరాలుండె. కొంత అమ్మేసినాము. ఇంగా 20 ఎకరాలుదాకా ఉంది.
చాంద్‌బాషా: మరి పంట సాగుచేయలేదా?
వెంకటరమణమ్మ: నీళ్లుండల్లగద నాయనా
చాంద్‌బాషా: ఏమ్మా నీ పేరేంటి? మీరు మహిళా గూపుల్లో ఉన్నారా?
ఇందిరమ్మ: నా పేరు ఇందిరమ్మ సార్..నేనూ మహిళా సంఘంలో ఉండాను. ఆ గ్రూపుల సంగతి ఎత్తుకుంటే ఈ పొద్దంతా సాల్దు. మా అప్పులన్నీ మాఫీ జాత్తామని సెంద్రబాబు జెప్తే ఓట్లేసినాము. కానీ ఇంతవరకూ మాఫీ అయింది లేదు. బ్యాంకులకల్లా పొయ్యేదే మానేసినాము. ఎవురి పరపతీ లేకుండానే మాకు బ్యాంకోళ్లు అప్పిచ్చేవాళ్లు. ఇబ్బుడు ఆ పరిస్తితి లేదు.
చాంద్‌బాషా: ఏన్నా బాగుండావా? నిన్ను చూస్తుంటే కొంత తెలిసిన వ్యక్తిలా ఉన్నావ్..ఏం ఊరంతా ఖాలీ అయిపోయిందే. వీధుల్లో కూడా కంప చెట్లు మొలచాయి...
మహేశ్వర్‌రెడ్డి: మా ఊరు ఒకప్పుడు కల కల లాడేది. పంటలు కూడా బాగా పండేవి. యా ఇంటి ముందు జూసినా కాడెద్దులుండేవి. యా ఇంట్లో జూసినా ధాన్నానికి కొదవ ఉండేది గాదు. ఇప్పుడు మాకే నీళ్లు లేవు. ఇంగ వాటికెట్లా అని అందరూ అమ్మేసినారు. ఊరిలో 110 ఇండ్లుంటే 86 ఇండ్లు వలస పోయినాయి. 74 బోర్లుంటే ఇబ్బుడు రెండు బోర్లలో మాత్రమే నీళ్లు వస్తున్నాయి. అవిగూడా ఊర్లో ఉన్నోళ్లకు తాగేకి సరిపోతాయి.
చాంద్‌బాషా: మీ ఊరు మళ్లీ కలకల లాడాలంటే ఏం చేయాలి? మీ ఊరి వలసల నివారణకు మార్గమే లేదా?
మహేశ్వర్‌రెడ్డి: ఎందుకు లేదు సార్..మా ఊరికి పైపక్కన 2 కి.మీ దూరంలోనే చెర్లోపల్లి అని ఉంది. అక్కడ 2005లో అబ్బుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హంద్రీనీవా రిజర్వాయర్ ప్రారంభించినాడు. ఆయన హయాంలో 60 శాతం పనులు పూర్తి అయినాయి. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు 10 శాతం పనులు చేశారు. ఇంగా 30 శాతం క ట్ట పని ఉంది. అది పూర్తయిందంటే 2 టీఎంసీల నీళ్లు అక్కడ నిలబడతాయి. మళ్ల మా ఊరికే గాదు..మా చుట్టు పక్కల 20, 30 పల్లెలకు భయం లేదు. బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. మల్ల అందరికీ చేతి నిండా పని ఉంటుంది.
చాంద్‌బాషా: ఏం పెద్దయ్యా..ఏందో కార్డు చేతిలో పట్టుకున్నావ్..ఏందది? ఆధార్ కార్డు ఉన్నట్లుందే..! ఎక్కడికి పోతున్నావ్?
పాపిరెడ్డి: నాకు పించన్ రాలేదు నాయనా..దేవళంకాడ ఇత్తాండారంటే పోతున్నా..ఇంతకు ముందు ఇన్నూరు వచ్చే తబ్బుడు టైంకు సరిగ్గా ఇస్తాండ్రి..ఇబ్బుడు అన్నీ ఎగిరిపోయినాయి.
చాంద్‌బాషా : నీ ఆధార్ కార్డులోనూ, రేషన్ కార్డులోనూ అన్నీ సక్రమంగానే ఉన్నాయే..డేట్ ఆఫ్ బర్త్ కూడా 1933 ఉంది. ఇంకేంటి ప్రాబ్లం?
పాపిరెడ్డి: నాకు భూమి ఉండాద ని ఇవ్వడం లేదంట. ఎన్ని భూములుంటే ఏం లాభం. నీళ్లు లేకపోతే..ఇంట్లో అందురూ పొట్ట జేతపట్టుకొని దేశాలబడి ఎల్లిపోయినారు. నాకూ కన్నులు సరిగ్గా కనబడవు.
చాంద్‌బాషా: ఏం అన్నయ్యలూ..ఇద్దరూ గోడకింద కూర్చొని ఏందో మాట్లాడుకుంటున్నారు..నాలుగు మాటలు మాకూ జెబితే వింటాం కదా?
చిన్నపరెడ్డి: సార్..నా వయ్‌సు 68. నాకు ఇంతకుముందు పెన్షన్ వచ్చేది. ఇబ్బుడు పెరికేసినారు. వీడు ఈశ్వర్‌రెడ్డి. వీడికీ 64 ఏండ్లుండాయి. మేము మా ఓటు సైకిలుకు యేయలేదని పించన్ ఎత్తేసినారు. మా బాద ఎవురికీ చెప్పుకోలేకున్నాం.
ఆ తర్వాత ఎమ్మెల్యే చాంద్‌బాషా అక్కడ నుండి నేరుగా చెర్లోపల్లి చేరుకొని అక్కడ అర్ధంతరంగా ఆగిపోయిన హంద్రీనీవా రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అక్కడున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, అయితే వారం రోజులుగా మళ్లీ ఆపేశామని వారు ఎమ్మెల్యేతో చెప్పారు. ఎందుకు మళ్లీ ఆగిపోయాయని అడిగితే చెర్లోపల్లి గ్రామస్థులు కొందరు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే గానీ పనులు చేయనీయమంటూ అడ్డుకున్నారని తెలిపారు. దీంతో తాను సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు.