‘పుర’లో భారీగా అవినీతి
బడ్జెట్ సమీక్షలో సీఎం కేసీఆర్ అసంతృప్తి
కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం
ఆర్‌డబ్ల్యూఎస్‌కే కొత్త నగర పంచాయతీల వాటర్‌గ్రిడ్ బాధ్యతలు
ఆస్తుల సృష్టి కోసం ‘ఉపాధి’ నిధులు వినియోగించుకోవాలని సూచన
సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజీ బోర్డు (జల మండలి), టౌన్ ప్లానింగ్ విభాగాల్లో భారీగా అవినీతి జరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి విభాగాల్లో అవినీతి నిర్మూలన కోసం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు లంచం ఇవ్వకుండా మున్సిపాలిటీల్లో అనుమతులు పొందినప్పుడే సుపరిపాలన అందినట్లుగా భావించాలని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో కలసి సీఎం కేసీఆర్ సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే పైపులైన్లకు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి... ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కొత్త నగర పంచాయతీల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలోనే ‘మిషన్ భగీరథ’ పనులు చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్‌రోడ్ లోపల ఉన్న 190 గ్రామాలకు హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నీళ్లు అందించాలని ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు వాటి ఆదాయ, వ్యయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంటు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు.
ఉభయతారకంగా ‘ఉపాధిహామీ’
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉభయతారకంగా వినియోగించుకోవాలని, ఏ కార్యక్రమాలను చేపట్టాలనే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాల సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపాధి పథకం కింద వేలకోట్లు ఖర్చవుతున్నా... గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధిగానీ, ఆస్తుల సృష్టి కానీ జరగడం లేదన్నారు. ఉపాధి కల్పించడంతో స్మశాన వాటికలు, సిమెంట్‌రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు వంటి నిర్మాణాల కోసం నిబంధనలను అనుసరించి ఉపాధిహామీ నిధులను వినియోగించాలని చెప్పారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులు, బాధ్యతలు, కార్యదర్శులు వారి విధులను గుర్తించేలా మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఐటీ రంగాన్ని విస్తరించాలి
హైదరాబాద్‌తో పాటు వరంగల్ నగరానికి ఐటీ రంగాన్ని విస్తరింపజేయాలని ఆ శాఖతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఐటీ రంగం ద్వారా ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)గా ఇచ్చే నిధులను ఒకచోటికి చేర్చి ప్రజావసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఖర్చు చేయాలని ఆదేశించారు.