చిగురిస్తున్న ఆశలు
హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త సర్కారు ప్రాధాన్యంలో జిల్లా పారిశ్రామికాభివృద్ధి తక్షణ ఎజెండాగా ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై మంగళవారం సమీక్షిస్తూ కారిడార్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే మౌలిక వసతుల కల్పన, భూసేకరణ ఇక్కడ ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వరంగల్: రెండు దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన ఈ ప్రణాళికను ఇప్పుడు అమలు చేస్తే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధానికి కేవలం 40 కిలోమీటర్ల దూరం నుంచే జిల్లా సరిహద్దులు ప్రారంభమవుతాయి. ఇక హైదరాబాద్ పారిశ్రామిక వాడల శివార్లతో పోల్చితే ఈ దూరం మరింత తగ్గే అవకాశం ఉన్నందున ఈ కారిడార్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. జిల్లాలో బొగ్గు, విద్యుత్, గోదావరి నీరు, అటవీ సంపద, ఐరన్‌వోర్, డోలమైట్ తదితర ఖనిజ సంపద తగినంత ఉన్నందున వీటిని వినియోగించుకుని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసే అంశంపై ప్రభుత్వం ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక ఉపాధి లేక జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. వీరిని వినియోగించుకుని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుతోపాటు జాతీ య, రాష్ట్రరోడ్లు, కాజీపేట, వరంగల్ రైల్వే కూడళ్లు కూ డా ఉండడం లాభించే విషయంగా పేర్కొంటున్నారు.
పెంబర్తిలో ఇత్తడి పరిశ్రమ, జనగామలో పారిశ్రామిక వాడ ఉంది. నగర శివారు రాంపూర్‌లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఐటీ కేంద్రం ఇక్కడే ఉంది. వీటి మధ్య సమన్వయం సాధించడంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల పరిస్థితులున్నాయి. ఇక్కడ పత్తి విస్తారంగా పండుతోంది. ఒకప్పుడు నగరంలోనే పదివేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా ఆజంజాహి మిల్లు ఉపాధి కల్పించింది. తాజా పరిస్థితుల్లో ఇక్కడ టైక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్టేషన్‌ఘనపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో ఈ ప్రాంతంలో లెదర్‌పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. మౌలిక వసతులు కల్పిస్తే పారిశ్రామిక కారిడార్ నిర్మాణం అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక అందజేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సర్కారు తాజా ప్రయత్నంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెడితే పారిశ్రామిక అభివృద్ధి దిశగా జిల్లా మరో అడుగు ముందుకేసినట్టు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.