Industrial Corridor construction
-
మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే
బలవంతపు భూసేకరణపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా రైతులతో ప్రతిపక్ష నేత జగన్ నక్కపల్లి: నక్కపల్లి మండలంలో పీసీపీఐఆర్, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని.. రైతులకు అండ గా నిలుస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబుకు మాట తప్పడం అలవాటే అని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో యువభేరి కార్యక్రమం ముగిం చుకుని కాకినాడ వెళ్తున్న జగన్‌కు నక్కపల్లిలో స్థానిక నాయకులు, రైతులు స్వాగతం పలికారు. తీర ప్రాంత గ్రామాల్లో భూసేకరణ వల్ల నష్టపోతున్న పలువురు రైతులు జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. బలవంతపు భూసేకరణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తెలియజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు అయినంపూడి మణిరాజు, రైతునాయకుడు గొర్లబాబూరావు, పార్టీ మండల అధ్యక్షుడు పాపారావు తదితరులు మాట్లాడుతూ 2010లో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని.. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మండలంలో పర్యటించి బలవంతపు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారని జగన్‌కు తెలియజేశారు. ఇక్కడ తీసుకుంటున్న భూముల్లో ఏకంపెనీలు ఏర్పాటు చేస్తారో కూడా చెప్పడంలేదన్నారు. దీనిపై జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ చంద్రబాబుకు మాటతప్పడం అలవాటేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ అధికారం లేనప్పుడు మరోలాగ మాట్లాడతారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిలదీస్తే పౌరుషం పుట్టుకొస్తుందన్నారు. నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుతారన్నారు. కేవలం రోడ్లకోసం ఐదువేల ఎకరాలు అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎంతమంది బాధిత రైతులున్నారు.. ఏయేపంటలు పండుతాయి, ఈభూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు, మత్స్యకారుల వివరాలతో సమగ్ర సమాచారాన్ని అసెంబ్లీ సమావేశాల్లోగా అందజేయాలని జగన్ కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. జగన్‌ను కలిసిన వారిలో సర్పంచ్‌లు గోవిందు, తిరుపతిరావు, బాబూరావు, శ్రీను, వీర్రా జు, ఎంపీటీసీ సభ్యు లు వెలగా ఈశ్వరరావు, ఏసుబాబు, శేషారత్నం, యూత్ అధ్యక్షుడు కోసూరుమధు, రాపర్తి వీరభద్రరావు, ముద్దాశ్రీను తదితరులు ఉన్నారు. జగన్‌కు ఘనస్వాగతం... పాయకరావుపేట: విశాఖపట్నం నుంచి కాకినాడ వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాయకరావుపేటలో జాతీయ రహదారిపై జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. తాండవ వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమల వేయగా ఆ మహనీయుడి విగ్రహానికి జగన్ నమస్కరించుకున్నారు. ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ అల్లాడ శివకుమార్, కోడా కోటేశ్వరరావు అధినేతను కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు వచ్చి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిని ఆహ్వానించారు. -
చిగురిస్తున్న ఆశలు
హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త సర్కారు ప్రాధాన్యంలో జిల్లా పారిశ్రామికాభివృద్ధి తక్షణ ఎజెండాగా ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై మంగళవారం సమీక్షిస్తూ కారిడార్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే మౌలిక వసతుల కల్పన, భూసేకరణ ఇక్కడ ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరంగల్: రెండు దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన ఈ ప్రణాళికను ఇప్పుడు అమలు చేస్తే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధానికి కేవలం 40 కిలోమీటర్ల దూరం నుంచే జిల్లా సరిహద్దులు ప్రారంభమవుతాయి. ఇక హైదరాబాద్ పారిశ్రామిక వాడల శివార్లతో పోల్చితే ఈ దూరం మరింత తగ్గే అవకాశం ఉన్నందున ఈ కారిడార్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. జిల్లాలో బొగ్గు, విద్యుత్, గోదావరి నీరు, అటవీ సంపద, ఐరన్‌వోర్, డోలమైట్ తదితర ఖనిజ సంపద తగినంత ఉన్నందున వీటిని వినియోగించుకుని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసే అంశంపై ప్రభుత్వం ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఉపాధి లేక జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. వీరిని వినియోగించుకుని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుతోపాటు జాతీ య, రాష్ట్రరోడ్లు, కాజీపేట, వరంగల్ రైల్వే కూడళ్లు కూ డా ఉండడం లాభించే విషయంగా పేర్కొంటున్నారు. పెంబర్తిలో ఇత్తడి పరిశ్రమ, జనగామలో పారిశ్రామిక వాడ ఉంది. నగర శివారు రాంపూర్‌లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఐటీ కేంద్రం ఇక్కడే ఉంది. వీటి మధ్య సమన్వయం సాధించడంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల పరిస్థితులున్నాయి. ఇక్కడ పత్తి విస్తారంగా పండుతోంది. ఒకప్పుడు నగరంలోనే పదివేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా ఆజంజాహి మిల్లు ఉపాధి కల్పించింది. తాజా పరిస్థితుల్లో ఇక్కడ టైక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్టేషన్ఘనపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో లెదర్‌పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. మౌలిక వసతులు కల్పిస్తే పారిశ్రామిక కారిడార్ నిర్మాణం అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక అందజేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సర్కారు తాజా ప్రయత్నంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెడితే పారిశ్రామిక అభివృద్ధి దిశగా జిల్లా మరో అడుగు ముందుకేసినట్టు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.