మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే
బలవంతపు భూసేకరణపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
రైతులతో ప్రతిపక్ష నేత జగన్
నక్కపల్లి: నక్కపల్లి మండలంలో పీసీపీఐఆర్, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని.. రైతులకు అండ గా నిలుస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు మాట తప్పడం అలవాటే అని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో యువభేరి కార్యక్రమం ముగిం చుకుని కాకినాడ వెళ్తున్న జగన్‌కు నక్కపల్లిలో స్థానిక నాయకులు, రైతులు స్వాగతం పలికారు. తీర ప్రాంత గ్రామాల్లో భూసేకరణ వల్ల నష్టపోతున్న పలువురు రైతులు జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. బలవంతపు భూసేకరణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తెలియజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు అయినంపూడి మణిరాజు, రైతునాయకుడు గొర్లబాబూరావు, పార్టీ మండల అధ్యక్షుడు పాపారావు తదితరులు మాట్లాడుతూ 2010లో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని.. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మండలంలో పర్యటించి బలవంతపు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారని జగన్‌కు తెలియజేశారు. ఇక్కడ తీసుకుంటున్న భూముల్లో ఏకంపెనీలు ఏర్పాటు చేస్తారో కూడా చెప్పడంలేదన్నారు.
దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ చంద్రబాబుకు మాటతప్పడం అలవాటేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ అధికారం లేనప్పుడు మరోలాగ మాట్లాడతారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిలదీస్తే పౌరుషం పుట్టుకొస్తుందన్నారు. నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుతారన్నారు. కేవలం రోడ్లకోసం ఐదువేల ఎకరాలు అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎంతమంది బాధిత రైతులున్నారు.. ఏయేపంటలు పండుతాయి, ఈభూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు, మత్స్యకారుల వివరాలతో సమగ్ర సమాచారాన్ని అసెంబ్లీ సమావేశాల్లోగా అందజేయాలని జగన్ కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. జగన్‌ను కలిసిన వారిలో సర్పంచ్‌లు గోవిందు, తిరుపతిరావు, బాబూరావు, శ్రీను, వీర్రా జు, ఎంపీటీసీ సభ్యు లు వెలగా ఈశ్వరరావు, ఏసుబాబు, శేషారత్నం, యూత్ అధ్యక్షుడు కోసూరుమధు, రాపర్తి వీరభద్రరావు, ముద్దాశ్రీను తదితరులు ఉన్నారు.
జగన్‌కు ఘనస్వాగతం...
పాయకరావుపేట: విశాఖపట్నం నుంచి కాకినాడ వెళుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పాయకరావుపేటలో జాతీయ రహదారిపై జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. తాండవ వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమల వేయగా ఆ మహనీయుడి విగ్రహానికి జగన్ నమస్కరించుకున్నారు. ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ అల్లాడ శివకుమార్, కోడా కోటేశ్వరరావు అధినేతను కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు వచ్చి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిని ఆహ్వానించారు.