రాజధానిలో బలవంతపు భూసేకరణ
రాజధానిలో బలవంతపు భూసేకరణ
Published Sat, Apr 29 2017 11:11 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM
– రైతులను సర్వనాశనం చేసిన సీఎం
– ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపాటు
కల్లూరు (రూరల్): సీఎం చంద్రబాబు రాజధానిలో బలవంతపు భూసేకరణ చేపట్టి రైతుల జీవితాలను సర్వనాశనం చేశారని రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం రాయల్ ఫంక‌్షన్‌హాలులో వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పచ్చని పొలాలను లాక్కొని రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించారన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో లోకేష్ సార్వభౌమాధికారం అనే పదాన్ని కూడా సరిగా పలకలేకపోయారని ఎద్దేవా చేశారు. రాయలసీమ జిల్లాల్లో విపరీతమైన కరువు పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు.
ప్రజలను మోసగించిన సీఎం
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.వై.రామయ్య విమర్శించారు. సీఎంకు ప్రకృతి కూడా సహకరించడం లేదన్నారు. ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ తరిమికొట్టారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ నుంచి చంద్రబాబును తరిమికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబును ప్రజలు తుడిచేస్తారని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతీన్ ముజాద్ధీన్ పేర్కొన్నారు.
మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నేత..
మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం పని చేస్తే కార్యకర్తల కోసం 24గంటలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరేయాలి :
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగరేయాలని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎంఏ హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు జహీర్ అహ్మద్ ఖాన్, అయూబ్ అలీఖాన్, వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, సువర్ణారెడ్డి, జాషువా, మేరీ సంపత్‌కుమారి, నగర నాయకులు రామ్మోహన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రవీందర్‌రెడ్డి, ఫారుఖ్‌సాహెబ్, మహిళా నాయకురాళ్లు సలోమి, సఫియాఖాతున్, వాహిదా, విజయలక్ష్మీ, మంగమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement