మంచి మాట: నాణ్యతతో మాన్యత | Respect for quality: The poorer the quality, the worse it is | Sakshi
Sakshi News home page

మంచి మాట: నాణ్యతతో మాన్యత

Published Mon, Feb 6 2023 3:50 AM | Last Updated on Mon, Feb 6 2023 3:50 AM

Respect for quality: The poorer the quality, the worse it is - Sakshi

నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి.

నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి.

నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది.

గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది.

ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది.

ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి.


కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి.

నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి.

నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం.

– రోచిష్మాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement