సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. మహిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?!
అమ్మ అయింది, తోబుట్టువు ఆయింది, ఆలి అయింది; అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ. అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళ. మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ.
మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ; మానవ జీవనకథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. ‘మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’ అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందలయేళ్ల క్రితమే చెప్పా రు. ‘సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు’ అని ఒక పూర్వ సంస్కృతశ్లోకం మనకు చెబుతోంది.
మనవాళ్లు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే.
మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపా ముద్ర, గార్గి, మైత్రేయి, అదితి, విశ్వనార, స్వస్తి, శశ్వతి, సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ్రపా దురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు. వేదంలో ఒక మహిళ ‘‘నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ’’ అంటుంది.
ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. ‘సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి’ అనీ, ‘మహిళలు యుద్ధంలో పా ల్గొనాలి’ అనీ చెప్పిన వేదం ‘భర్తకు సంపా దించే మార్గాలు నేర్పించు’ అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది.
‘అదిశక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియ చెప్పడం జరిగింది. ‘శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజెప్పా రు. మహిళ లేకపోతే శక్తే లేదు. మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళతత్త్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళతత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన మనుగడ చెయ్యాలి.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment