ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య పెరగాలి | High Court CJ Justice PK Mishra on International Women's Day | Sakshi
Sakshi News home page

ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య పెరగాలి

Published Wed, Mar 8 2023 3:35 AM | Last Updated on Wed, Mar 8 2023 3:35 AM

High Court CJ Justice PK Mishra on International Women's Day - Sakshi

సాక్షి, అమరావతి: జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యతనివ్వకపోతే దేశ, సమాజం పురోగతి సాధించలేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తే ప్రపంచంలో భారతదేశం తిరుగులేని స్థానం సంపాదిస్తుందని ఆయన అభి­ప్రాయపడ్డారు. రాష్ట్రపతి, గవర్నర్‌లుగా, సుప్రీం­­కోర్టు, హైకోర్టు జడ్జిలుగా పలువురు మహి­ళలు ఉన్నారని, అయినప్పటికీ ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు­కుని మంగళవారం హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, మహిళా న్యాయ­మూర్తులు జస్టిస్‌ బి.శ్రీభానుమతి, జస్టిస్‌ వడ్డిబోయన సుజాత, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్, పలువురు న్యాయ­వాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ మహిళలను పూజిం­చడం, గౌరవించడం మన ధర్మమని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు. ఏపీ హైకోర్టులో గతంలో మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు 28 శాతానికి పైగా మహిళలే ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థతోపాటు ఇతర శాఖల్లో నిర్వహించే నియామక పరీక్షల్లో మహిళలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. 

ఆత్మస్థైర్యం కోల్పోకూడదు
మహిళా న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీభానుమతి, జస్టిస్‌ సుజాత, జస్టిస్‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ హైకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య మరింత పెరగాల్సి ఉందన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఉన్న అడ్డంకులను మహిళలు తమకు తామే తొలగించుకోవాలన్నారు. మహి­ళలు ఎన్నడూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదని, తమను తాము తక్కువగా భావించకూడదని తెలిపారు.

కేవలం వాయిదాలు అడిగేందుకే కాకుండా వాదనలు వినిపించే అవకాశాలను మహిళా న్యా­యవాదులు అందిపుచ్చుకోవాలన్నారు. సీనియర్‌ న్యాయవాది భాస్కరలక్ష్మి మాట్లా­డుతూ మహిళా     సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు పురు­షులను సైతం ఆహ్వానించాలని, తద్వారా మహిళల కష్టాలను అర్థం చేసుకునే అవకాశం వారికి కలుగుతుందన్నారు. అనంతరం జస్టిస్‌ భాను­మతి, జస్టిస్‌ సుజాత, జస్టిస్‌ జ్యోతిర్మయితోపాటు భాస్కరలక్ష్మిని న్యాయవాదుల సంఘం ప్రతి­నిధులు      ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement