సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది
తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది.
ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది.
మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment