Trans Union
-
అన్ సెక్యూర్డ్ రుణాలకే ఎక్కువ డిమాండ్
ముంబై: క్రెడిట్ కార్డులపై వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి మార్చి నాటికి 2.94 శాతానికి చేరాయి. క్రెడిట్‌కార్డ్, వ్యక్తిగత రుణాల వాటా వేగంగా పెరుగుతున్నట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్ సిబిల్’ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రక్షణలేని రుణాలు పెరిగిపోతుండడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిల్ నివేదిక విడుదల కావడం గమనార్హం. మూడు నెలలకు మించి చెల్లింపులు లేని రుణాలను ఎన్పీఏలుగా పరిగణిస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డులపై మూడు నెలలకు పైగా చెల్లింపులు చేయని రుణాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 0.66 శాతం పెరిగినట్టు, వ్యక్తిగత రుణాల్లో ఎన్పీఏలు 0.04 శాతం పెరిగి 0.94 శాతంగా ఉన్నట్టు సిబిల్ తెలిపింది. ఇక క్రెడిట్ కార్డ్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణాలు సైతం 29 శాతం వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు (ఎల్ఏపీ) 38 శాతం పెరిగి అత్యంత వేగంగా వృద్ధి చెందిన రిటైల్ రుణ విభాగంగా ఉన్నట్టు వివరించింది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ప్రాపర్టీపై రుణాలను తీసుకుంటూ ఉంటాయి. గృహ రుణాలపై రేట్ల ప్రభావం గృహ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతమే వృద్ధి చెందాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఈ విభాగంలో రుణాల వృద్ధి తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–మార్చి మూడు నెలల కాలాన్ని పరిశీలించినట్టయితే విలువ పరంగా ఫ్లాట్‌గా ఉంటే, సంఖ్యా పరంగా 11 శాతం తగ్గినట్టు సిబిల్ నివేదిక స్పష్టం చేసింది. ప్రాపర్టీ రేట్లతోపాటు, గృహ రుణాలపైనా రేట్లు పెరగడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది. ఆస్తుల నాణ్యతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కస్టమర్లకు (అప్పటి వరకు రుణం తీసుకోని వారు) రుణాల విషయంలో రుణదాతలు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో అలాంటి కొత్త కస్టమర్లకు జారీ చేసిన రుణాల వాటా 16 శాతంగానే ఉందని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 19 శాతంగా ఉన్నట్టు వివరించింది. -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
చిన్న పట్టణాల్లోనే రుణాలకు అధిక డిమాండ్
ముంబై: కొత్తగా రుణాలు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఇద్దరు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచే ఉంటున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారిలో మహిళలు, రైతులు, యువత ఉంటున్నట్టు తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవల విస్తృతికి ఇది కీలకమని పేర్కొంది. 2021లో తొలిసారి రుణాలు తీసుకున్నవారు 3.5 కోట్లుగా ఉంటే, 2022లో జనవరి–సెప్టెంబర్ మధ్య కొత్తగా 3.1 కోట్ల మంది పెరిగినట్టు వెల్లడించింది. కొత్త రుణ ఖాతాదారులు (ఎన్టీసీ) అంటే అప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోకుండా, రుణ చరిత్ర లేని వారు అని అర్థం. కన్జ్యూమర్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, బంగారం రుణాలను వీరు తీసుకున్నారు. 2022 మొదటి తొమ్మిది నెలల్లో కొత్తగా రుణ చరిత్ర ఆరంభించిన కస్టమర్లలో 30 శాతం మేర కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు తీసుకున్న వారు కావడం గమనార్హం. అంటే ఇంట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్‌ఫోన్ తదితర ఉత్పత్తుల కోసం తీసుకున్న రుణాలుగా వీటిని భావించొచ్చు. వీటి తర్వాత 16 శాతం మంది వ్యవసాయ రుణాలు తీసుకుంటే, 13 శాతం మేర వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక వివరించింది. -
గత ఏడాది భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు
ముంబై: భారత్‌ను కేంద్రంగా చేసుకుని డిజిటల్ లావాదేవీల ద్వారా వ్యాపార సంస్థలను మోసం చేసే ఉదంతాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఇలాంటి సందేహాస్పద యత్నాలు 28 శాతం పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్ వెల్లడించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా ముంబైలో ఉండగా.. ఢిల్లీ, చెన్నై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘మోసగాళ్లు సాధారణంగా చెప్పుకోతగిన ప్రపంచ పరిణామాల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కోవిడ్-19 మహమ్మారి, డిజిటల్ వినియోగం పెరగడం ఈ ఆన్లైన్ యుగంలో కీలక పరిణామంగా మారింది. మోసగాళ్లు దీన్నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు‘ అని ట్రాన్స్‌యూనియన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షాలీన్ శ్రీవాస్తవ తెలిపారు. 2021 మార్చి 10 నాటికి కోవిడ్-19ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. అంతక్రితం ఇదే వ్యవధితో పోలిస్తే డిజిటల్ మోసాల ప్రయత్నాలు 28 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 40,000 పైగా అంతర్జాతీయ వెబ్సైట్లు, యాప్స్‌పై జరిగిన వందల కోట్ల లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. లాజిస్టిక్స్ రంగంలో మోసాల యత్నాలు అత్యధికంగా 224 శాతం మేర పెరగ్గా, టెలికం (200 శాతం), ఆర్థిక సేవలు (89 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తుల డెలివరీని దారి మళ్లించడం ద్వారా మోసగించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయి. బీమా, గేమింగ్, రిటైల్, పర్యాటకం వంటి విభాగాల్లో మాత్రం ఇలాంటి ఉదంతాలు కొంత తగ్గాయి. చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
రుణ గ్రహీతల్లో... మూడోవంతు మహిళలే
ముంబై: మహిళలు రుణాలను ఆశ్రయించే పరిస్థితి పెరుగుతోంది. రిటైల్ రుణాలు తీసుకుంటున్న వారిలో మహిళల శాతం 2020 సెప్టెంబర్ నాటికి 28 శాతానికి చేరినట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థ వెల్లడించింది. రుణాలు తీసుకుంటున్న మహిళల శాతం 2014 నుంచి 21 శాతం మేర పెరిగినట్టు వివరించింది. 2014 నాటికి రుణాలు తీసుకునే మహిళలు 23 శాతంగానే ఉన్నారని పేర్కొంది. కానీ ఇదే కాలంలో రుణాలను ఆశ్రయించిన పురుషులు 16 శాతమే పెరిగారని.. మొత్తం మీద పురుషులతో పోలిస్తే మహిళలే ఈ కాలంలో ఎక్కువగా రుణ బాట పట్టారని.. రుణ మార్కెట్లో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 4.7 కోట్లకు చేరుకుందని సిబిల్ నివేదిక తెలియజేసింది. ‘‘రిటైల్ రుణాల్లో రూ.15.1 లక్షల కోట్లు నేడు మహిళలు తీసుకున్నవే. గత ఆరేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున పెరిగింది’’ అని వివరించింది. ‘‘కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తోడు, ఆర్థిక అవకాశాలను సొంతం చేసుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’’ అని సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఇళ్ల కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడం, మహిళలకు ప్రోత్సాహకంగా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం కూడా దీనికి తోడ్పడినట్టు చెప్పారు. -
మున్ముందు ఎన్పీఏలు మిలీనియల్స్‌వేనా?
ముంబై: మిలీనియల్స్ (1980– 2000 మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్పీఏలు) మారనున్నాయా..? గత రెండేళ్లుగా బ్యాంకులకు మిలీనియల్స్ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్సెక్యూర్డ్ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్ యూనియన్ సిబిల్ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్ సంఖ్య 58% పెరగ్గా, ఇతర విభాగంలో ఈ వృద్ధి 14%గానే ఉందని సిబిల్ నివేదిక తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో భారీ ఎన్పీఏల నేపథ్యంలో బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువ గా ఆధారపడడం తెలిసిందే. అన్ సెక్యూర్డ్ రుణాల కింద క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కన్జ్యూమర్ రుణాలు ఇస్తున్నారు. మిలీనియల్స్ రుణాల్లో 72% ఇవే ఉంటున్నాయని సిబిల్ నివేదించింది. ఇక మిలీనియల్స్ తీసుకుంటున్న రుణాల్లో సురక్షిత (సెక్యూర్డ్) రుణాల కిందకు వచ్చే వాహన రుణాలు 9% ఉన్నట్లు సిబిల్ వెల్లడించింది. తమ క్రెడిట్ స్కోరుపై మిలీనియల్స్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, స్కోరును పర్యవేక్షించుకుంటున్నారని పేర్కొంది. 700 కంటే తక్కువ స్కోరు కలిగిన వారిలో 51% మంది 6 నెలల్లోనే క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకున్నారని వివరించింది. -
పావుశాతం పెంచినా... ఇబ్బందే!
♦ అమెరికాలో రుణాల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లు ♦ మన కరెన్సీలో రూ.250 లక్షల కోట్లపైనే ♦ దీన్లో విద్యా రుణాలే 1.4 లక్షల కోట్లు; 86 లక్షల మందిపై ప్రభావం ♦ వారందరికీ చెల్లింపులు కొంత ఇబ్బందే: ట్రాన్స్ యూనియన్ వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వు పెంచింది పావుశాతమే. కానీ ఈ పెంపుతో అమెరికాలో కొన్ని లక్షల మందికి రుణాలు మరింత భారం కాబోతున్నాయి. గృహ రుణాల వంటి దీర్ఘకాలిక రుణాలపై ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు పడకపోయినా... స్వల్పకాలిక రుణాలైన క్రెడిట్ కార్డు రుణాలు, విద్యా రుణాల వంటి వాటిపై మాత్రం తక్షణం ప్రభావం ఉంటుందన్నది నిపుణుల మాట. నిజానికి మన దేశంలో ఆర్బీఐ తన రెపో రేటును పెంచితే బ్యాంకులు తక్షణం వడ్డీ రేట్లు పెంచటం, తగ్గించటం వంటివేమీ చేయవు. కానీ అమెరికాలో ఫెడ్ గనక ఫండ్ రేటును పెంచినా, తగ్గించినా ఆ ప్రభావం తక్షణం రుణాలపై పడుతుంది. అమెరికా మనలా పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు కనక... అక్కడివారిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఆశకు బదులు తాము తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయమే అధికం. ‘‘2016 డిసెంబర్లో ఫెడ్ ఇలాగే పావు శాతం రేటు పెంచింది. అప్పట్లో దాదాపు 86 లక్షల మంది రుణ గ్రహీతలు ఈ పెంపును భరించలేకపోయారు. నిజానికి ఈ పెంపు చిన్నదే. దీనివల్ల రుణ గ్రహీతలపై సగటున నెలకు 18 డాలర్ల భారం మాత్రమే పడుతుంది. కానీ పెంచిన మూడు నెలల తరువాత కొన్ని లక్షల మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు’’ అని ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్ యూనియన్ తెలియజేసింది. విశేషమేంటంటే ఫెడ్ పెంపు వల్ల భారం పడేది సమాజంలోని దిగువ స్థాయి వర్గాలపై మాత్రమే కాదు. ‘‘ఇది దిగువస్థాయి వర్గాలకు మాత్రమే కాదు. ఎగువ స్థాయి, అత్యున్నత స్థాయి వర్గాలకూ దుర్వార్తే’’ అని ట్రాన్స్ యూనియన్‌లో రీసెర్చ్, కన్సల్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిధి వర్మ చెప్పారు. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దాదాపు ఏడేళ్ల పాటు ఫెడరల్ రిజర్వ్ తన ఫండ్ రేటును జీరో స్థాయిలోనే ఉంచింది. తరువాత ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటోందని భావించి 2015 డిసెంబరు నుంచి మెల్లగా పెంచటం ప్రారంభించింది. అయితే ఫండ్ రేటు జీరో స్థాయిలో ఉన్నపుడు వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా ఉండటంతో ఇదే అదనుగా విద్యా రుణాలు, ఇతర వినియోగ రుణాల్ని స్థానికులు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రుణాల మొత్తం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఫెడ్ చెబుతోంది. గడిచిన ఐదేళ్లలో రుణాల మొత్తం ఏకంగా 31 శాతం పెరిగిందని కూడా ఫెడ్ తెలియజేసింది. ఈ మొత్తంలో దాదాపు లక్ష కోట్లు మాత్రమే క్రెడిట్ కార్డులు, ఇతర లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో రివాల్వ్ అవుతోంది. మిగిలినవన్నీ స్థిర రుణాలే. మార్టిగేజ్‌పై భారం తక్కువే! నిజానికి ఫెడ్ గనక ఫండ్ రేటును పెంచితే దాని ఆధారంగా రుణ రేట్లు పెరుగుతాయి. అయితే మార్ట్గేజ్ రుణాలపై ఈ ప్రభావం తక్కువేనని, ఎందుకంటే అవన్నీ దీర్ఘకాలిక రుణాలని ఆర్థిక సంస్థలు పేర్కొన్నాయి. ‘‘నిజం చెప్పాలంటే అత్యున్నత స్థాయిలోని సూపర్ ప్రైమ్ రుణదాతలు కూడా ఈ పెంపును తట్టుకునే స్థితిలో ఉండరు’’ అని నిధి వర్మ చెప్పారు. దీనివల్ల వినియోగదారులు తమ రుణాలను తీర్చగలిగే స్థితిలో లేకపోతే... వారి రుణ సామర్థ్యంలో కోత పడుతుందని కూడా ఆమె తెలియజేశారు. రుణ గ్రహీతలు అనుకోని పరిస్థితులు ఎదురైతే తట్టుకోవటానికి కొంత మొత్తాన్ని పక్కన ఉంచుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తూనే ఉంటారు కూడా. ‘‘వచ్చే ఏడాది కాలంలో 1 శాతం ఫండ్ రేటు పెరిగే అవకాశముంది. దీనివల్ల దాదాపు 25 లక్షల మంది వినియోగదారులు దెబ్బతింటారు’’ అని ట్రాన్స్ యూనియన్ పేర్కొంది. మొత్తం రుణాల్లో విద్యా సంబంధ రుణాలు దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయని... గడిచిన ఐదేళ్లలో ఇవి ఏకంగా 36.3 శాతం ఎగశాయని, తాజా పెంపుతో విద్యా రుణాల భారాన్ని మోస్తున్నవారు బాగా దెబ్బతింటారని ట్రాన్స్ యూనియన్ వివరించింది. ‘‘ప్రస్తుతం విద్యా రుణాలపై వడ్డీ రేటు 3.76 శాతంగా ఉంది. అది 2017–18 విద్యా సంవత్సరానికి 4.45 శాతానికి చేరొచ్చు. దీనిపట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’’ అని సంస్థ తెలియజేసింది. అయితే వడ్డీ పెరుగుదల చాలా తక్కువని, దీనివల్ల జనం నెలవారీ బడ్జెట్లో దారుణమైన మార్పులేవీ రాబోవని నెర్డ్ వాలెట్లో స్టూడెంట్ లోన్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న బ్రియాన్నా మెక్గుర్రన్ వ్యాఖ్యానించారు. ‘‘కాకపోతే రుణ గ్రహీతలకు ఇది చాలా క్లిష్టమైన సమయమే’’ అన్నారామె.