పావుశాతం పెంచినా... ఇబ్బందే! | What the Fed interest rate hike means for inflation, borrowers | Sakshi
Sakshi News home page

పావుశాతం పెంచినా... ఇబ్బందే!

Published Fri, Jun 16 2017 12:49 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

పావుశాతం పెంచినా... ఇబ్బందే! - Sakshi

పావుశాతం పెంచినా... ఇబ్బందే!

అమెరికాలో రుణాల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లు
మన కరెన్సీలో రూ.250 లక్షల కోట్లపైనే
దీన్లో విద్యా రుణాలే 1.4 లక్షల కోట్లు; 86 లక్షల మందిపై ప్రభావం
వారందరికీ చెల్లింపులు కొంత ఇబ్బందే: ట్రాన్స్‌ యూనియన్‌
 


వాషింగ్టన్‌: అమెరికా ఫెడరల్‌ రిజర్వు పెంచింది పావుశాతమే. కానీ ఈ పెంపుతో అమెరికాలో కొన్ని లక్షల మందికి రుణాలు మరింత భారం కాబోతున్నాయి. గృహ రుణాల వంటి దీర్ఘకాలిక రుణాలపై ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు పడకపోయినా... స్వల్పకాలిక రుణాలైన క్రెడిట్‌ కార్డు రుణాలు, విద్యా రుణాల వంటి వాటిపై మాత్రం తక్షణం ప్రభావం ఉంటుందన్నది నిపుణుల మాట. నిజానికి మన దేశంలో ఆర్‌బీఐ తన రెపో రేటును పెంచితే బ్యాంకులు తక్షణం వడ్డీ రేట్లు పెంచటం, తగ్గించటం వంటివేమీ చేయవు. కానీ అమెరికాలో ఫెడ్‌ గనక ఫండ్‌ రేటును పెంచినా, తగ్గించినా ఆ ప్రభావం తక్షణం రుణాలపై పడుతుంది.

అమెరికా మనలా పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు కనక... అక్కడివారిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఆశకు బదులు తాము తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయమే అధికం. ‘‘2016 డిసెంబర్లో ఫెడ్‌ ఇలాగే పావు శాతం రేటు పెంచింది. అప్పట్లో దాదాపు 86 లక్షల మంది రుణ గ్రహీతలు ఈ పెంపును భరించలేకపోయారు. నిజానికి ఈ పెంపు చిన్నదే. దీనివల్ల రుణ గ్రహీతలపై సగటున నెలకు 18 డాలర్ల భారం మాత్రమే పడుతుంది. కానీ పెంచిన మూడు నెలల తరువాత కొన్ని లక్షల మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు’’ అని ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్‌ యూనియన్‌ తెలియజేసింది.

విశేషమేంటంటే ఫెడ్‌ పెంపు వల్ల భారం పడేది సమాజంలోని దిగువ స్థాయి వర్గాలపై మాత్రమే కాదు. ‘‘ఇది దిగువస్థాయి వర్గాలకు మాత్రమే కాదు. ఎగువ స్థాయి, అత్యున్నత స్థాయి వర్గాలకూ దుర్వార్తే’’ అని ట్రాన్స్‌ యూనియన్‌లో రీసెర్చ్, కన్సల్టింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిధి వర్మ చెప్పారు. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దాదాపు ఏడేళ్ల పాటు ఫెడరల్‌ రిజర్వ్‌ తన ఫండ్‌ రేటును జీరో స్థాయిలోనే ఉంచింది. తరువాత ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటోందని భావించి 2015 డిసెంబరు నుంచి మెల్లగా పెంచటం ప్రారంభించింది.

అయితే ఫండ్‌ రేటు జీరో స్థాయిలో ఉన్నపుడు వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా ఉండటంతో ఇదే అదనుగా విద్యా రుణాలు, ఇతర వినియోగ రుణాల్ని స్థానికులు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రుణాల మొత్తం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఫెడ్‌ చెబుతోంది. గడిచిన ఐదేళ్లలో రుణాల మొత్తం ఏకంగా 31 శాతం పెరిగిందని కూడా ఫెడ్‌ తెలియజేసింది. ఈ మొత్తంలో దాదాపు లక్ష కోట్లు మాత్రమే క్రెడిట్‌ కార్డులు, ఇతర లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రూపంలో రివాల్వ్‌ అవుతోంది. మిగిలినవన్నీ స్థిర రుణాలే.

మార్టిగేజ్‌పై భారం తక్కువే!
నిజానికి ఫెడ్‌ గనక ఫండ్‌ రేటును పెంచితే దాని ఆధారంగా రుణ రేట్లు పెరుగుతాయి. అయితే మార్ట్‌గేజ్‌ రుణాలపై ఈ ప్రభావం తక్కువేనని, ఎందుకంటే అవన్నీ దీర్ఘకాలిక రుణాలని ఆర్థిక సంస్థలు పేర్కొన్నాయి. ‘‘నిజం చెప్పాలంటే అత్యున్నత స్థాయిలోని సూపర్‌ ప్రైమ్‌ రుణదాతలు కూడా ఈ పెంపును తట్టుకునే స్థితిలో ఉండరు’’ అని నిధి వర్మ చెప్పారు. దీనివల్ల వినియోగదారులు తమ రుణాలను తీర్చగలిగే స్థితిలో లేకపోతే... వారి రుణ సామర్థ్యంలో కోత పడుతుందని కూడా ఆమె తెలియజేశారు. రుణ గ్రహీతలు అనుకోని పరిస్థితులు ఎదురైతే తట్టుకోవటానికి కొంత మొత్తాన్ని పక్కన ఉంచుకోవాలని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తూనే ఉంటారు కూడా. ‘‘వచ్చే ఏడాది కాలంలో 1 శాతం ఫండ్‌ రేటు పెరిగే అవకాశముంది.

దీనివల్ల దాదాపు 25 లక్షల మంది వినియోగదారులు దెబ్బతింటారు’’ అని ట్రాన్స్‌ యూనియన్‌ పేర్కొంది. మొత్తం రుణాల్లో విద్యా సంబంధ రుణాలు దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయని... గడిచిన ఐదేళ్లలో ఇవి ఏకంగా 36.3 శాతం ఎగశాయని, తాజా పెంపుతో విద్యా రుణాల భారాన్ని మోస్తున్నవారు బాగా దెబ్బతింటారని ట్రాన్స్‌ యూనియన్‌ వివరించింది. ‘‘ప్రస్తుతం విద్యా రుణాలపై వడ్డీ రేటు 3.76 శాతంగా ఉంది. అది 2017–18 విద్యా సంవత్సరానికి 4.45 శాతానికి చేరొచ్చు. దీనిపట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’’ అని సంస్థ తెలియజేసింది. అయితే వడ్డీ పెరుగుదల చాలా తక్కువని, దీనివల్ల జనం నెలవారీ బడ్జెట్లో దారుణమైన మార్పులేవీ రాబోవని నెర్డ్‌ వాలెట్‌లో స్టూడెంట్‌ లోన్‌ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న బ్రియాన్నా మెక్‌గుర్రన్‌ వ్యాఖ్యానించారు. ‘‘కాకపోతే రుణ గ్రహీతలకు ఇది చాలా క్లిష్టమైన సమయమే’’ అన్నారామె.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement