సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ.
సావిత్రి
మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు.
జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు.
విజయనిర్మల
విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం.
నందినీ రెడ్డి
అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది.
మంజుల ఘట్టమనేని
సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు.
సుధా కొంగర
ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment