ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్’ గురించి తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది.
నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్ సిరీస్ తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు నిర్మించారు.
సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి నిర్మాతగా మారి... హీరో కిరణ్ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నిర్మించింది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు.
మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది.
ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోర్ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment