దాతృత్వం లేదా ఈవి అన్నది ఉద్గుణాలు అన్నిటిలోకెల్లా ఉద్గుణం; సద్గుణాలు అన్నిటిలోకెల్లా సద్గుణం. అవసరమైంది లేనివాళ్లకు తగిన విధంగా అందించడానికి తన శక్తిమేరకు ప్రయత్నించడం ప్రతి మనిషికీ తప్పకుండా ఉండాల్సిన లక్షణం. అది లక్షణంగా మాత్రమే కాకుండా అంతకుమించి ప్రతివ్యక్తికీ ఉండాల్సిన ప్రధాన లక్ష్యంగా కూడా ఉండాలి.
వేదవాఙ్మయంలో భాగంగా మనకు అందుబాటులో ఉన్న భిక్షుసూక్తం కమ్యూనిజంకన్నా ఎంతో ముందే అన్నార్తులకు అన్నం పెట్టడం, దీనులకు దానం చెయ్యడం గురించి ప్రగాఢంగా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘దేవతలు ఆకలిని మరణానికి కారణంగా విధించలేదు. బాగా ఆహారం తిన్న వాళ్లకు కూడా మరణం వచ్చి తీరుతుంది. దానశీలికి సంపద తగ్గదు. ఇవ్వని లేదా పెట్టని వాడిని ఓదార్చే వారు కూడా ఉండరు‘ అంటూ భిక్షుసూక్తం తొలి శ్లోకం అర్థం చేసుకుని ఆచరించాల్సినదాన్ని ఆవిష్కృతం చేసింది.
ఆకలికి ఆహారం కూడా కరువై అలమటిస్తున్నవాళ్లు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వాళ్లు ఎక్కడో, అక్కడక్కడో మాత్రమే కాదు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. వాళ్లను మనం చూడకపోవడం, చూడలేకపోవడం కాదు చూసినా చూడనట్టు ఉన్నాం, ఉంటున్నాం. మనకు ఎందుకులే అనుకుంటూ, అంటూ మనం వాళ్ల పక్కనే నివసిస్తున్నాం. ఇది అమానవీయం. ఈ అమానవీయత మనలో కొత్తగా చోటు చేసుకున్న అవలక్షణం కాదు. అది మనలో ఎప్పటి నుంచో గూడుకట్టుకుని లేదా పేరుకుపోయి ఉంది. ఆ లక్షణం మనలో ఉండకూడదు అని తెలియజేస్తూ, మనకు తగిన స్ఫూర్తిని ఇస్తూ ఎప్పటి నుంచో ఎంతో చెప్పబడింది; ఎందరో మహనీయులు మనకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. అయినా కూడా ఆ అవలక్షణం అవనిలో అంతరించిపోలేదు.
ప్రపంచం పరిణామాల్ని పొందుతూ ఇవాళ ఉన్న స్థితికి వచ్చాక కూడా ఆకలి అన్నది ప్రపంచంలో ఇంకా ఎందరినో బాధిస్తోంది. ఆకలి తన ఆకలిని తీర్చుకోలేకపోతోందేమో? అందువల్ల అది ఇంకా మనుషుల ప్రాణాల్ని తింటూనే ఉందేమో? ఎప్పటినుంచో ప్రపంచంలో ఆకలి అగ్నికి మనుషుల ప్రాణాలు ఆహుతి అవుతూనే ఉన్నాయి.
‘అన్నం కలిగిన వాడై ఉండీ, అవసరమైన దీనులకి ఆహారం పెట్టకుండా మనసును చంపుకుని ఆ దీనుల ముందే ఎవడయితే తాను అనుభవిస్తూ తింటాడో వాడికి అనునయించే వాళ్లు దొరకరు’ అన్న విషయాన్ని ఒక హెచ్చరికగా భిక్షుసూక్తం మనకు తెలియజెప్పింది. ఈ సూక్తం లో చెప్పబడినట్టుగా ఆకలి కారణంగా మన సమాజంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి.
‘ధనవంతుడు పేదలకు తప్పకుండా ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాల్ని ఆలోచించి ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే రథచక్రాలు తిరుతున్నట్టుగా సంపద ఒకరి నుంచి మఱొకరికి వెళుతూ ఉంటుంది’ అనీ,‘మూర్ఖుడు అహారాన్ని ఇతరులకి పెట్టకుండా ఆశగా సేకరించి నిల్వ ఉంచుకుంటాడు. నిజం చెబుతున్నాను అది వాడికి చావునే ఇస్తుంది. దేవుడికో, స్నేహితుడికో ఇవ్వకుండా తాను తినే వాడు ఒట్టి పాపి అవుతాడు‘ అనీ భిక్షుసూక్తం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. కానీ మానవులు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పాపులుగా లేదా దోషులుగా మనుగడ చేస్తున్నారు.
‘ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగే బలహీనులకు ఎవరు వెంటనే ఆహారాన్ని ఇస్తారో వారి కోసం విలువైనవి వేచి ఉన్నాయి. వారు విరోధులతో కూడా స్నేహాన్ని పొందుతారు’ అని భిక్షుసూక్తం ఉపదేశించి దాన్ని మనం మనసుతోనూ, మెదడుతోనూ అందుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఆ పని చేస్తూ మనల్ని మనం మనుషులుగా మలుచుకోవాలి; తథాస్తు.
పూవుకే కాదు ఈవికి కూడా తావి ఉంటుంది! ఆ తావి పేరు కీర్తి!! ఈవివల్ల మనం కీర్తిమంతులం అవుదాం. బతికి ఉండగానే కాదు, మరలిపోయాక కూడా మనం
పరిమళిద్దాం. ఈవితో మనకు మనం తావిని అద్దుకుందాం.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment