పల్మునాలజీ కౌన్సెలింగ్
నా వయసు 55. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు.
- కె. పద్మనాభరావు, విజయవాడ
మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్‌లో మూడు రకాలు ఉన్నాయి. అవి...
క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్‌పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది.
సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
సిలికోసిస్‌కు చికిత్స ఉందా?
Published Tue, Aug 25 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement