కన్వర్షన్ లేని స్థలాలకు చెక్ !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అనధికార లే అవుట్లపై వీజీటీఎం ఉడా కొరడా ఝళిపిస్తోంది. అనుమతి లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచిస్తూ రిజిస్ట్రేషన్ శాఖకు ఉడా వీసీ ఉషాకుమారి ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల వల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
రాష్ట్ర రాజధాని విజయవాడ- గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు కానున్నదనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను నివేశన స్థలాలు గా కన్వర్షన్ చేయకుండా ఆ భూమిని రెండు, మూడు వందల చదరపు గజాలుగా విభజించి అమ్మకాలు జరుపుతున్నాయి. దీని వల్ల కొనుగోలుదారులు లే అవుట్ లేని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండదు.
ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ కంపెనీలు మొదట కొనుగోలు చేసిన వ్యక్తికి తెలియకుండా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అమ్మడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొనుగోలుదారుల మధ్య భూ వివాదాలు ఏర్పడతాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుని వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్ ఉషాకుమారి అనధికార లేఅవుట్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయరాదని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
తెనాలి డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉడా అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొంటూ రిజిస్ట్రారు కార్యాలయాలకు లేఖ రాశారు. ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచించారు.
జిల్లాలో ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, పెదకాకాని, తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అనధికార లే అవుట్లు అధికంగా ఉన్నట్టు ఉడా గుర్తించింది.
గతంలో ఈ అనధికార లేఅవుట్లలోని రహదారులను ఉడా సిబ్బంది పొక్లయిన్లు, బుల్‌డోజర్‌లతో ధ్వంసం చేసి, ప్రజలందరికీ తెలిసే విధంగా నోటీసు బోర్డులు ఏర్పాటు చేసేవారు.
ఈ సమాచారం తెలియని కొనుగోలుదారులు ఈ అనధికార లే అవుట్లలోని స్థలాలను కొనుగోలు చేసి మోసపోతుండేవారు.
ఇలాంటి సంఘటనల దృష్ట్యా వైస్ చైర్మన్ అనధికార లే అవుట్లలోని స్థలాలను రిజిస్టర్ చేయవద్దని గుంటూరు, తెనాలి రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు రాశారు.
అనధికార లే అవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి కన్వర్షన్ చార్జీలు వసూలు కావు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు గృహాలు నిర్మించుకునే అవకాశం ఉండదు. నిర్మాణాలు జరగాలంటే కన్వర్షన్ చార్జీలు తప్పకుండా చెల్లించాల్సి ఉండటంతో కొనుగోలుదారులకు మరి కొంత ఆర్థిక భారం పడుతుంది.
వివరణ : ఈ విషయమై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఉడా వీసీ నుంచి లేఖ వచ్చిన మాట వాస్తమేనని, అయితే సర్వే నంబర్ల సమాచారం పూర్తిగా ఇస్తే రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తామని చెప్పారు.