beti bachavo
-
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
బాలికల నిష్పత్తి పెంచాలి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించడం, వారిపై వివక్షను నిరోధించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం తన చాంబర్లో బేటీ బచావో పథకం జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల లింగ నిష్పత్తి తగ్గడానికి మహిళలకు స్వయం సాధికారత లేకపోవడం ఒక కారణమన్నారు. ఆడపిల్ల పుట్టిన తరువాత పౌష్టికాహారం, విద్యను అందించడంలో వివక్ష చూపుతున్నారని అన్నారు. సామాజిక రు గ్మతలు, లింగ నిర్ధారణ స్కానింగ్ సెంట ర్లు కూడా బాలికల నిష్పత్తి తగ్గడానికి కార ణాలు అవుతున్నాయని అన్నారు. 2011 సంవత్సరం జనాభా ప్రకారంగా వెయ్యి మంది పురుషులకు గాను 918 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. బాలికల నిష్పత్తిని పెంపొందించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, అందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు తమవంతుగా కృషి చేయాలన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలికల దశలో తక్కువగా ఉన్నారన్నారు. నిష్పత్తి సమానం కావాలంటే మహిళలు విద్య పరంగా ఎదగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 950 నిష్పత్తి కంటే తక్కువగా ఉన్న 640 జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో మన జిల్లా 945 నిష్పత్తితో ఉన్నట్లు వివరించారు. లింగ వివక్షను తగ్గించడానికి కొత్త పెళ్లి జంటలు, గర్భిణులు, తల్లులు, యువతీ యువకులు, వైద్యులు, డయాగ్నోసిస్ సెంటర్ల నిర్వహకులకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అవగాహన ప్రచార సామగ్రి, విద్య, వైద్యం, ఇతర అంశాలను చేపట్టేందుకు రూ.50 లక్షలతో ప్రణాళికను టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ స్రవంతి, రవీందర్, డీఈఓ రాజేశ్, డీఎంఅడ్‌హెచ్‌ఓ సుదర్శనం, డీపీఓ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా డోలోత్సవం మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహుడి ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా డోలోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి అనంతరం స్వామివారికి అభిషేకం చేసి డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాసచార్యులు, నర్సింహాచార్యులు, పరందామచార్యులు, సిబ్బంది సంతోష్, బాలయ్య, రమేశ్ ఉన్నారు. -
ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. తన అధ్యక్షతన ఏర్పాటైన బేటీ బచావో పథకం ఉపకమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా బాలికలకు మరింత మెరుగైన విద్యావకాశాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నది. ఇప్పటికే ఈ కమిటీ రెండుసార్లు భేటీ కాగా ఇప్పుడు మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని మహిళా శిశు సంక్షేమం, పాఠశాల విద్యావిభాగం, వైద్య, ఆరోగ్యం తదితర మంత్రిత్వశాఖల నుంచి కూడా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బాలికల్లో విద్యావకాశాలు పెంపొందించడం, ఉత్తీర్ణతాశాతం పెంచడం, లింగవివక్షకు తావులేకుండా విధానాలు రూపొందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. -
బాలల హక్కులను పరిరక్షించుకుందాం
వైవీయూ: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఎస్. మురళీధర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో బాలికలపై వివక్ష నేటికీ కొనసాగడం బాధాకరమన్నారు. బాలల హక్కులను పరిరక్షించడంలో చిత్తశుద్ధి, సమన్వయం ఎంతో కీలకమన్నారు. చిన్నారుల హక్కుల ఉల్లంఘనలను నిర్మూలించేందుకు బాలల హక్కుల పరిరక్షణకై నిరంతర ప్రజా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్టెప్ సీఈఓ మమత మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు రూపాల్లో సేవలందించే మహిళలపై వివక్ష వీడాలన్నారు. భ్రూణహత్యలను ఆదిలోనే అడ్డుకునే విధంగా అందరిలో చైతన్యం పెంపొందించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ దేశం ప్రగతి, సౌభాగ్యంలో స్త్రీ, పురుషులిద్దరూ రెండు చక్రాల వంటి వారన్నారు. ఏ ఒక్కరి సమతుల్యత దెబ్బతిన్నా ప్రగతి రథం ముందుకు నడవడం కష్టమన్నారు. అనంతరం ఆర్తీ ఫౌండేషన్ నిర్వాహకురాలు పి.వి. సంధ్య, ఐసీడీఎస్ అధికారి అరుణకుమారి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులు వివిధ దేశనాయకుల వేషధారణలతో హాజరై అలరించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం నిర్వాహకురాలు యుగళవాణి, రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.