ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. తన అధ్యక్షతన ఏర్పాటైన బేటీ బచావో పథకం ఉపకమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా బాలికలకు మరింత మెరుగైన విద్యావకాశాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నది. ఇప్పటికే ఈ కమిటీ రెండుసార్లు భేటీ కాగా ఇప్పుడు మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
దీనికి కేంద్ర ప్రభుత్వంలోని మహిళా శిశు సంక్షేమం, పాఠశాల విద్యావిభాగం, వైద్య, ఆరోగ్యం తదితర మంత్రిత్వశాఖల నుంచి కూడా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బాలికల్లో విద్యావకాశాలు పెంపొందించడం, ఉత్తీర్ణతాశాతం పెంచడం, లింగవివక్షకు తావులేకుండా విధానాలు రూపొందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.