నేడు మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టైటిల్ పోరు
దక్షిణాఫ్రికాతో భారత్ ‘ఢీ’
ఓటమి లేకుండానే రెండు జట్లు ఫైనల్లోకి
త్రిష, కమలినిలపై దృష్టి
మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది.
భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు!
ఆ ఇద్దరిని కట్టడి చేస్తే...
తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి.
మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.
భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.
కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్‌విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.
పిచ్, వాతావరణం
భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు.
Comments
Please login to add a commentAdd a comment