సెమీస్‌లో సైనా
► సింధు పరాజయం
► మలేసియా ఓపెన్ టోర్నీ
షా ఆలమ్ (మలేసియా): వరుసగా రెండో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ 22వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 19-21, 21-14, 21-14తో విజయం సాధించింది. గతవారం ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ సైనా సెమీస్‌కు చేరింది. పోర్న్‌టిప్‌తో 58 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన సైనా ఆ తర్వాత తేరుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు పోర్న్‌టిప్‌పై ఏడుసార్లు గెలిచిన సైనా రెండో గేమ్ నుంచి నిలకడగా ఆడింది.
11-7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ 5-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించిన సైనా విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో సైనా సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. అయితే గత మూడు పర్యాయాలు (2012, 2013, 2015) సైనా సెమీస్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 5-7తో వెనుకబడి ఉంది. 2013 స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఆమెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
మరోవైపు భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 7-21, 8-21తో ఓడిపోయింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఏదశలోనూ ఆమె ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది.
సెమీఫైనల్స్
ఉ. గం. 10.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-2లో
ప్రత్యక్ష ప్రసారం