సైనాకు మళ్లీ నిరాశ | Saina Nehwal loses in Malaysia Open semi-final | Sakshi
Sakshi News home page

సైనాకు మళ్లీ నిరాశ

Published Sun, Apr 10 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

సైనాకు మళ్లీ నిరాశ

సైనాకు మళ్లీ నిరాశ

ఎనిమిదోసారి తై జు యింగ్ చేతిలో పరాజయం
మలేసియా ఓపెన్ టోర్నీ

 
షా ఆలమ్: ప్రత్యర్థి పటిష్టంగా ఉంటే నిలకడగా రాణించడం తప్పనిసరని... లేకపోతే మంచి ఫలితాలు రావడం కష్టమేనని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అనుభవమైంది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 19-21, 13-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో సైనా సెమీఫైనల్లో నిష్ర్కమించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తాజా ఫలితంతో సైనా తన చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ చేతిలో వరుసగా ఆరోసారి ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనా ఓటమి చెందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.


 గత మూడేళ్లలో తై జు యింగ్‌పై ఒక్కసారి కూడా నెగ్గలేకపోయిన సైనా ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచింది. తొలి గేమ్‌లో సైనా వరుసగా ఏడు పాయింట్లు కోల్పోవడం ఆమె ఎంత ఒత్తిడిలో ఉందో సూచిస్తోంది. ఆరంభంలోనే 0-7తో వెనుకబడిన సైనా ఆ తర్వాత కోలుకునేందకు ప్రయత్నించింది. అయితే సైనా ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న తై జు యింగ్ వైవిధ్యభరితంగా ఆడుతూ భారత స్టార్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. పదునైన స్మాష్‌లు సంధించడంతోపాటు డ్రాప్ షాట్‌లతో తై జు యింగ్ ఆద్యంతం సైనాపై ఆధిపత్యం చలాయించింది. స్కోరు 14-20 వద్ద సైనా వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19-20కు చేరుకుంది. ఈ దశలో తై జు యింగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.  


రెండో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు స్కోరు సమం కూడా అయింది. అయితే కీలకదశలో సైనా తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విరామానికి తై జు యింగ్ 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి దూకుడు పెంచగా... సైనా డీలా పడిపోయి ఓటమిని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో ఓడిన సైనాకు 7,975 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 30 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement